(నేడు సెడ్మాకీ జయంతి)
భారతీయ సమరయోధులను స్మరించుకునే తరుణంలో తొలి తరం ఆదివాసీ వీరుడైన పులిసూర్ బాబురావ్ సెడ్మాకి పోరాటాన్ని నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. తొలి స్వాతంత్య్రం సంగ్రామం 1857 నుండి 1947 దాకా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న భూమి పుత్రులను బ్రిటిష్ పాలకులు బలి తీసుకున్నారు. కొందరిని బానిసలుగా, పీడితులుగా మార్చారు. రాజ్య దురాక్రమణదారులైన తెల్లదొరలు ఆదివాసులపై కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం ప్రకటిస్తూ తాంతియా భీల్, రాణి దుర్గావతి, రాణి మా గైడిన్లూ, బిర్సాముండా, రాంజీగోండ్ మొదలైన ఆదివాసీ యోధులను బలిగొన్నారు.
మధ్య భారతదేశంలో క్రీ.శ. 1240 -1749 వరకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిశా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో ఏర్పడిన ఆదివాసీ గోండ్వానా రాజ్యంలో రాజులుగా వెలుగొందిన గోండు గిరిజన పాలకులను, జమీందారులను, మోకాసలను సైతం బలిగొన్నారు. గోండ్వానా సమరశీలురలో పులిలాంటి యోధుడు పులిసూర్ బాబురావ్ సెడ్మాకీ. గోండ్వానా రాజ్యంలో సెడ్మాకీ ‘ఆదియోధుడు’. మధ్య భారతావనిలో గోండ్వానా ప్రాంతమైన చంద్రాపూర్ (మహారాష్ట్ర) లోని గోండులు సెడ్మాకీ ఆధ్వర్యంలో తిరుగుబాటు (185658) చేయగా, మరోవైపు ఆదిలాబాద్ సరిహద్దుల్లో మార్సికోల్ల రాంజీ గోండ్ బ్రిటీష్ సైన్యాలపై రోహిల్లాలు గోండుల తిరుగుబాటు (1857- 60) ఉద్విగ్నంగా జరిగింది.
భారత స్వాతంత్య్ర సమరంలో ఆరిపోతున్న దీపాలను వెలిగిస్తున్నట్లు… నేలకొరిగిన వీరుని స్థానంలో మరొకరిని ఎదిగేలా చేసి తెల్లదొరతనంపై ఎదురు దాడికి సిద్ధం చేశారు. ఎన్నో సవాళ్ళను, ప్రతిబంధకాలను ఎదుర్కొంటూ గోండ్వానా రాజ్య సంరక్షణ సమరానికి నాయకత్వం వహించిన గోండ్వాన వీరుడు సెడ్మాకీ గోండ్వానాలో అంతర్భాగమైన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా గోండి గ్రామంలో జమీందారి కుటుంబంలో 1833, మార్చి 12న జన్మించిన సెడ్మాకీ బాల్యం నుంచే అస్త్ర, శస్త్ర విద్యలో నైపుణ్యం సాధించి 25 ఏళ్ళకు -జమీందారీ వంశ వారసుడిగా బాధ్యతలు తీసుకున్నాడు. దురాక్రమణ, దుశ్చర్యల నుంచి రాజ్య రక్షణకు ప్రతిజ్ఞ చేశాడు. తెల్లదొరల ఆకృత్యాలను, వారి దాడులను తిప్పికొట్టడానికి కోయత్తోరులను, మరాఠీలను, ముస్లింలను కూడా ఏకం చేసి తన సైన్యంతో తెల్లదొరలపై తొలిసారిగా 1858, మార్చి 22న యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధంలో బ్రిటీష్ సైన్యాన్ని సెడ్మాకీ చిత్తుగా ఓడించాడు. బ్రిటీష్ కెప్టెన్ క్రికటన్ సారథ్యంలో సిగ్నాపూర్ పరిసరాలలో గోండులపై దండెత్తినా పరాజయం తప్పలేదు. పైగా చంద్రాపూర్ వైపు పారిపోయి తలదాచుకున్నారు.
బ్రిటీష్ బలగాలు సెడ్మాకీని ఓడించడానికి బ్రిటిష్ సైన్యాధిపతిగా నెక్స్ ఫియార్‌ను మరోసారి యుద్ధానికి పంపించారు. ఆధునిక ఆయుధాలు కొరవడినప్పటికీ గోండు సైన్యాలు సాంప్రదాయక బరిసెలు, బల్లెములు, బడితెలు, కత్తులతోనే ఎదుర్కొని బ్రిటిష్ సైన్యాలను ఓడించారు. యుద్ధంలో పరాజయాన్ని జీర్ణించుకోలేని బ్రిటిష్ ప్రభుత్వం సెడ్మాకీని ఒక కొరియర్ ద్వారా నిర్బంధించడానికి ప్రణాళికలు చేసింది. క్రికటన్, నెక్స్ ఫియార్ లు సెడ్మాకీని పట్టించిన వారికి కానుకగా జమీందారీగా నియమిస్తామని ప్రకటించారు. తనకు ఆమోదీ రాజపుత్రిక లక్ష్మీబాయి నమ్మినబంటు కావడంతో రక్షణార్థం ఆమె వద్దకు తరచూ వెళ్లేవాడు. ఆమె సెడ్మాకీ పోరాట పటిమను ప్రశంసిస్తూ, తన వద్ద విశ్రాంతి తీసుకోవాలని కోరింది. ఆమె నమ్మక ద్రోహంతో సైన్యానికి సమాచారం తెలిపిందామె. రాత్రికి రాత్రే ఆంగ్లేయులు నిద్రిస్తున్న సెడ్మాకీని బంధించి చంద్రాపూర్ తరలించారు. తెల్లదొరల కబంధ హస్తాలకు చిక్కి పాతికేళ్ళ వయసులోనే 1858, అక్టోబర్ 21న ఉరికంబమెక్కినాడు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన సెడ్మాకీ అజరామరుడు.
గుమ్మడి లక్ష్మీనారాయణ
94913 18409