పునె: పోర్ష్ కారును అత్యంత వేగంగా నడిపి ఇద్దరి ప్రాణాలను బలగొన్న మైనర్ బాలుని కేసులో తేలికగా బెయిల్ ఇవ్వడం వివాదాస్పదమై సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఇందులో జువైనల్ జస్టిస్ బోర్డు వ్యవహార శైలిపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది. ఈమేరకు మహిళా శిశు అభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ (సిట్) ని నియమించింది. బెయిల్ మంజూరుకు నిర్ణయం తీసుకున్న జువైనల్ బోర్డు అధిపతి డాక్టర్ ఎల్‌ఎన్ దన్వాడే పాత్రపై దర్యాప్తు చేయనున్నారు.
మే 19న పుణె లోని కళ్యాణ్ నగర్ ఏరియాలో పోర్ష్‌కారును బాలుడు అత్యంత వేగంగా నడిపి మోటార్‌బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొనడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ ఐటీ ఉద్యోగులు. కారు నడిపిన 17 ఏళ్ల బాలుడు ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నాడని పోలీస్‌లు చెప్పారు. ఆ తరువాత కొన్ని గంటలకు అరెస్ట్ అయిన బాలుడికి జువైనల్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. 300 పదాలతో వ్యాసరచన చేయమనడం, 15 గంటలు ట్రాఫిక్ పోలీస్‌లకు సాయం తదితర నిబంధనలతో తక్షణమే బెయిల్ మంజూరయింది.
దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు హోరెత్తాయి.
దీంతో తిరిగి నిందితుడిని అదుపు లోకి తీసుకొని జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే పోలీస్‌లు, డాక్టర్లు నిందితుడికి సాయం చేశారని తేలడంతో ఇప్పుడు జువైనల్ బోర్డుపై ప్రభుత్వం దృష్టి పడింది. ఐదుగురు సభ్యులతో ఏర్పాటైన విచారణ కమిటీ దీనిపై దర్యాప్తు చేసి వచ్చేవారం మహిళా శిశు అభివృద్ధి శాఖకు నివేదికను సమర్పించనున్నది. ఈ బోర్డులో జ్యుడీషియరీ నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మరో ఇద్దరు ఉంటారు. వీరు బెయిల్ మంజూరులో ఎంతవరకు నిబంధనల మేరకు వ్యవహరించారో కమిటీ విచారిస్తుందని డబ్లుసిడి కమిషనర్ ప్రశాంత్ నర్నవరే చెప్పారు.