పుణె: స్వర్గేట్ బస్‌స్టాండ్ వద్ద ఆగిఉన్న ఆర్టీసీ బస్సులో 26 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు 37 ఏళ్ల దత్తాత్రే రామ్‌దాస్ గాడేను 75 గంటల పాటు గాలించి గురువారం రాత్రి పోలీస్‌లు పట్టుకోగలిగారు. మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో నేరం జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. గుణత్ గ్రామానికి చెందిన రామ్‌దాస్‌ను పట్టుకోడానికి పోలీసులు 13 బృందాలు ఏర్పాటు చేశారు.
అతడి జాడ కనుక్కోడానికి పూణే లోని శ్రీరూర్ తాలూకాలో డ్రోన్లు, జాగిలాల సాయంతో గాలించారు. నిందితుడి స్వగ్రామం గుణత్ లోని చెరకు తోడల్లో దాక్కుని ఉండవచ్చని సోదాలు చేశారు. దాదాపు 100 మంది పోలీస్‌సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.నిందితుని ఆచూకీ ఇచ్చిన వారికి రూ. లక్ష బహుమతి కూడా ప్రకటించారు. నిందితుడి ఫోటో కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నిందితుడికి ఆకలేసి ఒక ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లోని వ్యక్తి నిందితుడిని గుర్తు పట్టి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అరెస్ట్ జరిగింది.
వెలుగులోకి నిందితుడి నేరాలు
నిందితుడు రామ్‌దాస్ నేర చరిత్ర బయటపడింది. 2019లో ఓ టాక్సీ కొనుగోలు చేసిన దగ్గర నుంచి పుణె అహల్యనగర్ మార్గంలో టాక్సీ తిప్పుతున్నట్టు విచారణలో తేలింది. అయితే అప్పటి నుంచి అతడు నగలతో కనిపించిన పలువురు వృద్ధులను తన ట్యాక్సీలో ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బెదిరించి, దోపిడీలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై దొంగతనం, దోపిడీ, చైన్‌స్నాచింగ్, మొదలైన పలు కేసులు ఉన్నట్టు గుర్తించామన్నారు. 2019 లో ఓ నేరం కేసులో జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నట్టు పోలీసులు చెప్పారు. తరచుగా స్వర్‌గేటు బస్టాండ్ వద్ద తిరుగుతూ , అక్కడికి వచ్చిన ప్రయాణికులకు తనకు తానుగా పోలీస్‌గా పరిచయం చేసుకునే వాడని అన్నారు. యువతిపై అత్యాచారానికి ముందు కూడా తనను పోలీస్‌గా పరిచయం చేసుకొని అక్క అని సంబోధిస్తూ నమ్మించాడని పేర్కొన్నారు.