Wednesday, January 22, 2025

నూహ్‌లో కూల్చివేతలపై హైకోర్టు స్టే

- Advertisement -
- Advertisement -

గురుగ్రామ్ : నూహ్‌లో కూల్చివేతలపై పంజాబ్‌హర్యానా హైకోర్టు స్టే విధించింది. అల్లర్ల కేసును సుమోటోగా స్వీకరించిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేతలపై వ్యతిరేకత రావడంతో స్టే విధించింది. రాళ్ల దాడిలో పాల్గొన్న నిందితుల ఇళ్లను హర్యానా పట్టణాభివృద్ధి శాఖ అధికారులు గత కొద్ది రోజులుగా బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. హర్యానా పట్టణాభివృద్ధి శాఖ భూములను కొందరు శరణార్థులు ఆక్రమించి కట్టడాలు నిర్మించినట్టు అధికారులు తెలిపారు.

వీరంతా ఇటీవల రాళ్ల దాడుల్లో పాల్గొన్నట్టు ఆధారాలు లభించడంతో ఇక్కడి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్టు స్టేకు ముందు అధికారులు వెల్లడించారు. వీటిలో రోహింగ్యా శరణార్థులకు చెందిన 50 కి పైగా నిర్మాణాలను నేలమట్టం చేసినట్టు తెలిపారు. ఈమధ్య ఒక రెస్టారెంట్‌ను కూడా అధికారులు కూల్చివేశారు. ఒక వర్గానికి చెందిన కొంతమంది రౌడీలు, గూండాలు ఆ రెస్టారెంట్ పై నుంచి మరో వర్గం ర్యాలీపై రాళ్లు విసరడం ద్వారానే నూహ్‌లో మత ఘర్షణలు మొదలయ్యాయని, ఇది అక్రమ నిర్మాణమని తేలడంతో దాన్ని కూడా కూల్చివేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో తాము డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన ఇళ్లను కూల్చివేస్తున్నారని కోర్టును ఆశ్రయించారు.

ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్ట ఆక్రమణల కూల్చివేతపై స్టే విధించింది. దీంతో తక్షణమే కూల్చివేతలను నిలిపివేయాలని నూహ్ పట్టణ డిప్యూటీ కమిషనర్ టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించడంతో కూల్చివేతలు నిలిపివేశారు. మరోవైపు పరిస్థితులు అదుపు లోకి రావడంతో సోమవారం కూడా నాలుగు గంటల పాటు కర్ఫూ సడలించినట్టు నూహ్ డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్‌గతా తెలిపారు. బ్యాంకులు, ఏటిఎం కేంద్రాలను కొంత సమయం పాటు తెరిచే ఉంచుతామని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు అల్లర్లకు సంబంధించి 56 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, 147 మందిని అరెస్టు చేసినట్టు పోలీస్‌లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News