Saturday, November 23, 2024

పంజాబ్ ‘రణ’రంగం!

- Advertisement -
- Advertisement -

BJP declared assets worth Rs 4847 cr in 2019-20

పంజాబ్ ఓటర్లు ఎవరి కంఠాన జయమాల వేస్తారో, మరెవరిపై పంజా విసురుతారోగాని ఆ పరిణామం జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముంది. బిజెపికి ఇప్పుడు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఎంతటి ముఖ్యమైనవో, ఈ నెల 20న జరగనున్న పంజాబ్ బ్యాలట్ సమరం కాంగ్రెస్‌కు అంతటి ప్రధానమైనది. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి, పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలో వున్నాయి. యుపి ఫలితాలు ఆ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోని బిజెపి పాలనపై కూడా ప్రజల తీర్పుగా పరిగణన పొందుతాయి. పంజాబ్ తీర్పు రాజీవ్ గాంధీ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. పంజాబ్‌లో పాలక కాంగ్రెస్ వ్యవహారాలను ఆ పార్టీ అధిష్ఠానంలోని యువ సారథులు రాహుల్, ప్రియాంక గాంధీలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల అక్కడి పార్టీ పరిస్థితులను చక్కదిద్దడంలో రాహుల్ గాంధీ ప్రత్యక్ష చొరవ చూపారు. చివరి వరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా వున్న కెప్టెన్ అమరిందర్ సింగ్‌ను తొలగించి అసెంబ్లీ ఎన్నికలు ఆరు మాసాల అతి స్వల్ప వ్యవధిలో వుండగా దళిత నేత చరణ్ జిత్ సింగ్ చన్నీని గద్దెనెక్కించిన ఘనత రాహుల్ గాంధీదే.

అది కెప్టెన్ అమరిందర్ సింగ్ పార్టీని విడిచిపెట్టి వేరు కుంపటి పెట్టుకోడానికి, అంతిమంగా బిజెపితో పొత్తు ఏర్పాటు చేసుకోడానికి దారి తీసింది. ఈ పరిణామం కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ఎంతో కొంత నష్టాన్ని కలిగించక తప్పదు. పంజాబ్ జనాభాలో 30 శాతానికిపైగా వున్న దళిత ఓట్లను దృష్టిలో వుంచుకొని రాహుల్ గాంధీ చన్నీకి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఇది నిజంగా సంచలనాన్నే సృష్టించింది. అర్ధబలం, అంగబలం లేని దళిత నేతకు పాలనా పగ్గాలు అప్పజెప్పడం సాహసమైన చర్యగానే గుర్తింపు పొందింది. అయితే అధికారం ఆఖరి మెట్టు మీద ఓ ఆరు మాసాల పాటు దళితుడికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంలో గొప్పేముందనే పెదవి విరుపులు కూడా చోటు చేసుకున్నాయి. దాని వల్ల ఆ వర్గానికి ఒరిగేదేమీ వుండదనే అభిప్రాయమూ వెల్లడైంది. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ముఠా గొడవలు జగమెరిగినవే. రాహుల్ గాంధీ ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూను బిజెపి నుంచి రప్పించి కెప్టెన్ అమరిందర్ సింగ్ మంత్రి వర్గంలో ఆయనకు చోటిప్పించడం ఆ పార్టీలో ఆంతరంగిక సంక్షోభాన్ని ఎంతగా సృష్టించిందో తెలిసిందే.

సిద్దూను మంత్రి వర్గం నుంచి వైదొలగేవరకు అమరిందర్ సింగ్ నిద్రపోలేదు. దానితో సిద్దూ అమరిందర్ సింగ్‌పై పగ పెంచుకున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని సిద్దూ కన్న కలలు ఇంత వరకు నెరవేరలేదు. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చన్నీని ప్రకటించడం సిద్దూకు పుండు మీద కారం చల్లినంత పని చేసింది. ఈ ఎన్నికల్లో సిద్దూ పార్టీ కోసం ఎంత వరకు మనసు పెట్టి పని చేస్తారనేది కూడా కాంగ్రెస్ విజయావకాశాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యమంత్రి చన్నీ రామ్ దాసియా సిక్కు వర్గానికి చెందిన వారు. ఆ వర్గం దళిత ఓటర్లు ఆయన పట్ల సానుభూతితోనే వున్నారు. అయితే అది కాంగ్రెస్ అనుకూల ఓటుగా మారుతుందా లేదా అనేది కీలకమని పరిశీలకులు భావిస్తున్నారు. కేజ్రీవాల్‌కు ఒక్క అవకాశమిచ్చి చూడండని ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ప్రచారం ఓటర్లను కొన్ని చోట్ల బాగా ఆకట్టుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఈసారి పంజాబ్‌లో కాంగ్రెస్, అకాలీదళ్, ఆప్, బిజెపి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ (అమరిందర్ సింగ్) కూటమి ప్రధానంగా ఎన్నికల బరిలో వున్నాయి. 117 మంది సభ్యులు గల పంజాబ్ శాసన సభకు 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 77 స్థానాలు, శిరోమణి అకాలీదళ్‌కు 17, ఆప్‌కు 20, బిజెపికి 3, ఇతరులకు 2 స్థానాలు వచ్చాయి. అందుచేత అత్యధిక మెజారిటీతో అప్పుడు అధికారంలోకి వచ్చి చివరి వరకు ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీకి పంజాబ్‌లో వున్న బలాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.

ఎన్నికలు దూసుకు వచ్చినంత వరకు ఆంతరంగిక కుమ్ములాటలతో కుతకుతలాడిపోయి ఎన్నికల సమయంలో కూడా లుకలుకలు తొలగించుకోలేకపోడం ఆ పార్టీకి గల పెద్ద బలహీనతగా స్పష్టపడుతున్నది. ఆ కారణంగా అది దెబ్బ తిన్నా గత శాసన సభలో కాంగ్రెస్‌కు చాలా దూరంగా 20 స్థానాలు మాత్రమే కలిగిన ఆప్ ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగే స్థాయిని పొందగలుగుతుందా లేక కొత్త శక్తి మీద మమకారంతో పంజాబ్ ప్రజలు ఆప్‌కి గాని, మరే కాంగ్రెసేతర పక్షానికి గాని అధికారం కట్టబెడుతారా అనేది చూడాలి. ప్రధాని మోడీ మొండిగా తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు, నూతన విద్యుత్తు బిల్లుకు వ్యతిరేకంగా ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో సాగి చరిత్ర సృష్టించిన అసమాన రైతు ఉద్యమంలో అధికంగా పాలు పంచుకున్నది పంజాబ్ రైతులే. అందుచేత వారి ఓటు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రాగలిగితే రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుకు అది అతిపెద్ద దన్ను అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News