స్వతంత్ర అభ్యర్థిగా సిఎం సోదరుడు..!
చండీగఢ్: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు రెబెల్స్ బెడద మొదలైంది. స్వయానా ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌సింగ్‌చన్నీ సోదరుడు మనోహర్‌సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బస్సీపతానా నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మనోహర్‌కు ఆశాభంగం కలగడంతో ఆ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తానన్నారు. వెనక్కి తగ్గేది లేదన్నారు. శనివారం కాంగ్రెస్ 86మందితో మొదటి జాబితాను విడుదల చేసింది. అందులో బస్సీపతానా స్థానాన్ని సిట్టింగ్ ఎంఎల్‌ఎ గురుప్రీత్‌సింగ్‌కు కేటాయించడంతో మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుప్రీత్ వల్ల ఆ నియోజకవర్గానికి ఎటువంటి మేలూ జరగలేదని, ఆయన అసమర్థుడని, స్థానికంగా పలువురు ప్రముఖులు తనను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని కోరారని మనోహర్‌సింగ్ తెలిపారు. గతేడాది ఆగస్టులో సీనియర్ వైద్యాధికారి ఉద్యోగానికి మనోహర్ రాజీనామా చేశారు. వైద్యంలో పోస్ట్ గ్రాడ్యువేషన్‌తోపాటు జర్నలిజమ్, న్యాయ విద్యలనూ మనోహర్ అభ్యసించారు. తనకు టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఆయన విమర్శిస్తున్నారు.