చండీగఢ్ : కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన జెడ్ ప్లస్ సెక్యూరిటీని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈమేరకు పంజాబ్ ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వశాఖకు రాతపూర్వకంగా తెలియజేసింది. అయితే పంజాబ్, ఢిల్లీ కాకుండా వేరే రాష్ట్రాల్లో భగవంత్‌సింగ్ మాన్‌కు సిఆర్‌పిఎఫ్ భద్రత కల్పించవచ్చని సూచించింది. దేశంలోనూ, విదేశాల నుంచీ మాన్‌కు బెదిరింపులు ఎదురయ్యే ప్రమాదం దృష్టా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ భగవంత్ సింగ్ మాన్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని నిర్ణయించింది.
అయితే పంజాబ్ పోలీసులు పంజాబ్ లోను, ఢిల్లీ లోను భద్రత కల్పిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. అందుకని ఇతర రాష్ట్రాల్లో మాన్‌కు భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరింది. భగవంత్‌సింగ్ మాన్‌కు సిఆర్‌పిఎఫ్ కు చెందిన విఐపి ప్రొటెక్షన్ స్కాడ్ కల్పిస్తారు. అలాగే దేశం మొత్తం మీద మాన్‌కు టాప్ కేటగిరీ జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తారు. ఇటీవలనే కేంద్ర హోం మంత్రిత్వశాఖ దీనికి ఆమోదం తెలియజేసింది. పంజాబ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఖలిస్థాన్ కార్యకలాపాలు సాగుతున్నందున కేంద్ర ఇంటెలిజెన్స్ , సెక్యూరిటీ ఏజెన్సీలు భగవంత్ సింగ్ మాన్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత తప్పనిసరి అని సిఫార్సు చేశాయి.