చండీగఢ్: స్థానిక అధికారుల నుంచి మద్దతు కొరవడిన దృష్టా ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలను ప్రస్తుతానికి నిలిపివేయాలని తన ప్రధాన కార్యాలయానికి సిఫార్సు చేస్తానంటూ ఆర్మీ జోనల్ కార్యాలయం ప్రకటించిన నేపథ్యంలో ఆర్మీకి చెందిన అగ్నిపథ్ నియామక ప్రక్రియకు సంపూర్ణ మద్దతు ఇస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం హామీ ఇచ్చారు. స్థానిక పాలనాయంత్రాంగం నుంచి అవసరమైన సహకారం లేదని, తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన ఆదేశాలు లేవనడం లేదా నిధులు లేవనడం కారణాలుగా చూపుతున్నారని ఆర్మీకి చెందిన జలంధర్ కంటోన్మెంట్ జోనల్ రిక్రూట్‌మెంట్ అధికారి పంజాబ్ చీఫ్ సెక్రటరీ వికె జంజువా, ప్రిన్సిపల్ కార్యదర్శి(ఉపాధి కల్పన) కుమార్ రాహుల్‌కు ఒక లేఖ రాశారు. తమకు స్పష్టమైన హామీ లిఖితపూర్వకంగా లభించేంత వరకు భవిష్యుత్తులో నిర్వహించే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలను పంజాబ్‌లో నిలిపివేయాలని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి సిఫార్సు చేయవలసి వస్తుందని ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయంగా పొరుగు రాష్ట్రాలలో ర్యాలీలను నిర్వహిస్తామని కూడా ఆయన తెలిపారు. దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి బుధవారం స్పందిస్తూ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీల నిర్వహణ కోసం ఆర్మీ అధికారులకు సంపూర్ణ సహకారం అందచేయవలసిందిగా డిప్యూటీ కమిషనర్లు అందరికీ ఆదేశాలు జారీచేసినట్లు ఆయన ట్వీట్ చేశారు.
Punjab CM Bhagwant Mann Supports Agneepath Scheme