భద్రతా వైఫల్యం ఆరోపణలను కొట్టిపారేసిన పంజాబ్ సిఎం
చండీగఢ్ : పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీకి భద్రతావైఫల్యం ఎదురైందని వచ్చిన ఆరోపణలను పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ గురువారం తప్పుపట్టారు. ప్రధాని మోడీ తాను ఏ కార్యక్రమంలో పాల్గొనకుండా వెనుతిరిగారని, దానికి రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యమే కారణమని తమ ప్రభుత్వాన్ని నిందించడం పొరపాటుగా ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ప్రధాని మోడీ పాల్గొనవలసిన ఫిరోజ్‌పూర్ ర్యాలీ సందర్భంగా బిజెపి వారు 70,000 కుర్చీలను ఏర్పాటు చేయగా, కేవలం 700 మంది మాత్రమే హాజరయ్యారని, జనం స్పందన పేలవంగా ఉండడమే మోడీ వెనక్కు తిరిగిపోడానికి కారణమైందని సిఎం పేర్కొన్నారు. ర్యాలీ కార్యక్రమానికి ముందుగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆ ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచుకుని క్షేత్రస్థాయి భద్రతా చర్యలను పర్యవేక్షిస్తుందని, అలాంటప్పుడు భద్రతా వైఫల్యానికి తావు లేదన్నారు. షెడ్యూలు ప్రకారం మోడీ హెలికాఫ్టర్ ద్వారా ప్రయాణించాల్సి ఉండగా, ఒక్కసారిగా రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని అనుకున్నారని సిఎం వివరించారు. పంజాబ్ వ్యతిరేక శక్తులు ప్రతీకార రాజకీయాలను విడిచిపెట్టి ప్రజలు ముఖ్యంగా రైతులు ఎందుకు వారిని ఇష్టపడడం లేదో ఆలోచించాలని హితవు పలికారు.