న్యూఢిల్లీ : తీహార్ జైలులో ఉన్న ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం కలుసుకున్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇన్సులిన్ తీసుకుంటున్నారని వెల్లడించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ “లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా కూటమి’ అభ్యర్థుల గెలుపు కోసం చురుగ్గా ప్రచారం సాగించాలి. ప్రజలు తన గురించి ఆందోళన చెందవద్దని ఎన్నికల సమయంలోతమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు” అని మాన్ తెలిపారు.
పంజాబ్‌లో గోధుమల ఉత్పత్తి, విద్యుత్ సరఫరా తదితర అంశాల గురించి కేజ్రీవాల్ తనను అడిగారన్నారు. అలాగే పంజాబ్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన 158 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ క్లియర్ చేశారని చెప్పడంతో ఆ మాట విని ఎంతగానో సంతోషించారని చెప్పారు. ఇటీవల తన గుజరాత్ పర్యటన గురించి కూడా చెప్పానన్నారు. ప్రజల ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రజలకు సందేశం ఇచ్చారన్నారు. కేజ్రీవాల్ అరెస్టయి జైలుకు వెళ్లాక సీఎం భగవంత్ మాన్ ఆయనను కలవడం ఇది రెండోసారి.