Monday, December 23, 2024

బిజెపిలో చేరిన పంజాబ్ కాంగ్రెస్ నేత మన్‌ప్రీత్‌సింగ్ బాదల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పంజాబ్‌లో కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు.ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన లేఖలో ఆయన పార్టీలో వర్గపోరు తీవ్రంగా ఉందని ఆరోపించారు. ఢిల్లీలోని కోటరీయే పంజాబ్‌లో వ్యవహారాలను చక్కబెడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను నిర్వహించే తీరు, నిర్ణయాలు తీసుకునే పద్ధతి, ముఖ్యంగా పంజాబ్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు తనను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని, ఇలా చెప్పడం చాలా చిన్న మాట అవుతుందని తన రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానం ఆదేశాలను పంజాబ్‌లోని పార్టీ విభాగం పాటించేలా చేయడానికి నిర్దేశించిన కోటరీ సమర్థవంతమైనది కాదని అన్నారు.

ఇప్పటికే తలోదారిలో నడుస్తున్న పార్టీనేతల మధ్య విభేదాలను తగ్గించడానికి బదులు ఈ కోటరీ పెద్దలు వర్గ విభేదాలను మరింతగా పెంచి పోషిస్తున్నారన్నారు. పార్టీలోని అత్యంత చెడ్డవారిని బలోపేతం చేయడాన్ని ఓ విధానంగా మార్చుకున్నారని మండిపడ్డారు. పార్టీలో తాను తీవ్ర అవమానాలకు గురయ్యానని పేర్కొన్నారు. ప్రభుత్వంలో, పార్టీలో తనకు ఎన్నో అవకాశాలు కల్పించినందుకు రాహుల్‌గాంధీకి బాదల్ కృతజ్ఞతలు తెలియజేశారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన బాదల్ ఏడేళ్ల క్రితం తన పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కాగా బిజెపి కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బాదల్ కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గోయల్ బాదల్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఎంతో అనుభవం కలిగిన రాజకీయ వేత్త అయిన బాదల్ బిజెపిలో చేరడంతో సిక్కులతో తమ పార్టీ అనుబంధం మరింత బలోపేతం అవుతుందనికేంద్రమంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News