చండీగఢ్ : బజరంగ్ దళ్ వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే బజరంగ్‌దళ్ , పిఎఫ్‌ఐ సంస్థలపై నిషేధం విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించడమే ఈ వివాదానికి కారణమైంది. దీనిపై హిందూ సురక్ష పరిషత్ బజరంగ్ దళ్ హిందీ వ్యవస్థాపకుడు హితేశ్ భరద్వాజ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు సమన్లు జారీ చేసింది. పరువు నష్టం కింద ఖర్గే రూ. 100 కోట్లు చెల్లించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన సివిల్ జడ్జి కోర్టు రమణదీప్ కౌర్ సమన్లు జారీ చేశారు. జులై 10 న హాజరు కావాలని ఖర్గేను ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో ఖర్గే బజరంగ్‌దళ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని పిటిషనర్ ఆరోపించారు. బజరంగ్‌దళ్‌ను దేశ వ్యతిరేక సంస్థతో కాంగ్రెస్ పోల్చిందని , కర్ణాటకలో అధికారం లోకి వస్తే నిషేధిస్తామని హామీ ఇచ్చిందని ఆరోపించారు. అయితే ఎన్నికలకు ముందే దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో కాంగ్రెస్ తన హామీపై వెనక్కు తగ్గింది. బజరంగ్‌దళ్‌ను నిషేధించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది.