Thursday, December 19, 2024

6 నెలలకు సరిపడ రేషన్, డీజిల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తమ డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని వైపు పంజాబ్ నుంచి ట్రాక్టర్లలో బయల్దేరిన వేలాదిమంది రైతులు కొన్ని నెలలకు సరిపడ రేషన్, డీజిల్‌ను తమ వెంట తీసుకెళుతున్నారు. నిరసనకారులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం శివార్లను మూసివేసినప్పటికీ అడ్డంకులను ఛేదించుకుని రైతులు ముందుకు సాగుతున్నారు. 2020లో ఢిల్లీ శివార్లలో బసచేసి దాదాపు 13 నెలలపాటు ఆందోళన చేసిన రైతులు ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలుచేయనందుకు మరోసారి నిరసనబాట పట్టారు.

తమ పంటలకు కనీస మద్దతుధర(ఎంఎస్‌పి) కల్పించడంతోపాటు ఇతర డిమాండ్ల సాధన కోసం రైతులు సమరశంఖం పూరించారు. తమ డిమాండ్లను సాధించుకునే వరకు తాము వెనుదిరిగే ప్రసక్తి లేదని, తమ సహనానికి ప్రభుత్వం ఎంతకాలమైనా పరీక్ష పెట్టుకోవచ్చని రైతులు సవాలు చేశారు. సూది నుంచి సుత్తి దాకా మా ట్రాలీలలో సమస్తం ఉన్నాయి. రాళ్లను పగలగొట్టే పరికరాలతో సహా అన్నీ మా వద్ద ఉన్నాయి. ఆరు నెలలకు సరిపడ రేషన్‌తో మా గ్రామాన్ని వదిలాం. హర్యానాకు చెందిన మా సోదరులకు కూడా సరిపడేంత డీజిల్ మా వద్ద ఉంది అని పంజాబ్‌లోని గుర్దాస్‌పూర్‌కు చెందిన హర్భజన్ సింగ్ అనే రైతు తెలిపారు.

ట్రాక్టరులో ఢిల్లీకి బయల్దేరిన ఆ రైతు తన ట్రాక్టరుకు రేషన్ సరుకులతో నింపిన రెండు ట్రాలీలను జతచేశారు. ట్రాక్టర్లు, ట్రాలీలతో బయల్దేరిన రైతులను అడ్డుకునేందుకు ప్రభుత్వం వారికి పెట్రోల్ బంకులలో డీజిల్ అమ్మకాలను నిలిపివేసింది. 2020లో జరిగిన రైతుల నిరసలా తాను కూడా పాల్గొన్నట్లు సింగ్ తెలిపారు. అయితే తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంత వరకు ఈసారి ఢిల్లీ నుంచి కదిలే ప్రసక్తి లేదని ఆయన ప్రకటించారు. గతంలో ప్రభుత్వం 13 నెలలపాటు కాలయాపన చేసినా తాము లొంగలేదని, తమ డిమాండ్లను నెరవేరుస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసి మాట తప్పిందని ఆయన ఆరోపించారు. ఈసారి మాత్రం తమ అన్ని డిమాండ్లు నెరవేరిన తర్వాతే ఢిల్లీని వీడుతామని పంజాబ్-హర్యానా సరిహద్దుల మీదుగా ఢిల్లీకి పయనమైన హర్భజన్ సింగ్ స్పష్టం చేశారు. చండీగఢ్‌లో ప్రభుత్వ ప్రతినిధి బృందం సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఫతేగఢ్ సాహిబ్ నుంచి రైతులు మంగళవారం ఉదయం ఢిల్లీకి పయనమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News