కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ముందుగా ఇచ్చిన చలో ఢిల్లీ పిలుపు మేరకు రైతులు ఢిల్లీ దిశగా కదులుతున్నారు. పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి చలో ఢిల్లీ కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. దేశంలోని పలు ప్రాంతాలనుంచి రైతులు ఢిల్లీకి వస్తారని రైతు నేతలు ప్రకటించినా, 90 శాతంమంది రైతులు పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలనుంచి మాత్రమే వస్తారని అంచనా. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ రహదారులను మూసేశారు. దీంతో రైతులు గ్రామీణ రోడ్ల మీదుగా ఢిల్లీ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రులు సోమవారం పొద్దుపోయేవరకూ జరిపిన చర్చల్లో ఫలితం తేలలేదు. రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు అంగీకరించిన మంత్రుల బృందం.. కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలన్న రైతు నేతల డిమాండ్ కు ఒప్పుకోలేదు. దీంతో మంగళవారం తాము తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని రైతు నేతలు ప్రకటించారు.
దీంతో ప్రభుత్వం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చర్యలు తీవ్రతరం చేసింది. సింఘు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లో భారీయెత్తున పోలీసు బలగాలను మోహరించింది. రోడ్లపై బారికేడ్లు, కాంక్రీటు దిమ్మెలు, ఇనుప వైర్లు పెట్టి, రైతులను అడ్డగించేందుకు సిద్ధమైంది.