Wednesday, January 22, 2025

న్యాయం కోసం కుస్తీ

- Advertisement -
- Advertisement -

జంతర్‌మంతర్‌లో రోజులుగా రెజ్లర్ల నిరసన
పంజాబ్, హర్యానా రైతుల మద్దతు 
లైంగిక వేధింపులకు పాల్పడ్డ బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్ అరెస్టుకు ఎస్‌కెఎం డిమాండ్
ఆరోపణలు నిరూపిస్తే ఉరేసుకుంటా : బ్రిజ్ భూషణ్

న్యూఢిల్లీ: లైంగిక అరోపణ నేపథ్యంలో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్, ఎంపి బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా రెజ్లర్లు చేపట్టిన నిరసన ఆదివారానికి 15వ రోజుకు చేరింది. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్‌లతో కలిసి స్టార్ రెజ్లర్లందరూ డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఇప్పటికే పలువురు నేతలు మద్దతు తెలుపారు. తాజాగా పంజాబ్, హర్యానాకు చెందిన వేలాది మంది రైతులు మద్దతు ప్రకటిస్తూ జంతర్ మంతర్ వద్దకు చేరుకుని సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈక్రమంలో ఆదివారం ఉదయం టిక్రీ సరిహద్దులతో రైతు నాయకులతో పాటు మహిళలు సైతం ఢిల్లీకి చేరుకోవడం కనిపించింది. రైతులు బస్సులు, పలు వాహనాల ద్వారా తరలివస్తున్నారు. మరో వైపు రైతులకు రైతు సంఘాల నేత రాకేశ్ టికాయిత్ మద్దతు ప్రకటించారు. పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుంటే పోలీస్‌స్టేషన్‌లో మహా పంచాయత్ నిర్వహిస్తామని హెచ్చరించారు. రెజ్లర్లకు మద్దతుగా నిరసన తెలిపిన రైతు సంఘం నాయకులు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి 15 రోజుల గడువు ఇచ్చారు. పోక్సో కేసులు ఎదుర్కొంటున్న ఫెడరేషన్ చీఫ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో రైతు నాయకుడు రాకేష్ టికైత్ మాట్లాడుతూ.. రెజ్లర్లు తమ ఆందోళనను కొనసాగించాలని, మే 21లోగా బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయకపోతే, భవిష్యత్తు కార్యాచరణపై ఆ రోజు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

నన్ను బూట్లతో కొట్టి చంపొచ్చు..
సంయుక్త కిసాన్ మోర్చా రెజ్లర్లకు మద్దతు ఇవ్వడంతో, విచారణ ఫలితం కోసం వేచి ఉండాలని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రైతు నాయకులను కోరారు. శనివారం రాత్రి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన 25 నిమిషాల వీడియోలో, ‘నాపై ఆరోపణలు రుజువైతే, ఉరి వేసుకుంటానని, విచారణ పూర్తయ్యాక, నేను మీ మహా పంచాయితీకి వస్తాను, నేను దోషిగా తేలితే మీరు నన్ను బూట్లతో కొట్టి చంపొచ్చు. ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News