చండీగఢ్: పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మధ్య మరోసారి వివాదం రాజుకుంటోంది. అక్టోబర్ 20, 21 తేదీలలో రెండు రోజులపాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్న పంజాబ్ ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్ పురోహిత్ తప్పుపడుతున్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఈ సమావేశాలలో ఆమోదించే తీర్మానాలన్నీ చట్టవిరుద్ధంగా పరిగణించబడతాయని గవర్నర్ హెచ్చరించారు. సట్టజ్ యమునా లింక్ కెనాల్ వివాదంపై అక్టోబర్ 20, 21 తేదీలలో రెండు రోజుల ్రప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు పంజాబ్ ప్రభుత్వం పిలుపునిచ్చింది.
అయితే ఈ ప్రత్యేక సమావేశాలను చట్టవిరుద్ధంగా భావిస్తున్న రాజ్‌భవన్ కార్యాలయం పంజాబ్ అసెంబ్లీ కార్యదర్శికి ఒక లేఖను పంపించింది. ప్రస్తుతం పంజాబ్‌లోని సరిహద్దు జిల్లాల పర్యటనలో ఉన్న గవర్నర్ పురోహిత్ శుక్రవారం గురుదాస్‌పూర్ చేరుకోనున్నారు.
కాగా..ఈ ఏడాది జూన్ 19,20 తేదీలలో కూడా పంజాబ్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. వీటిని కూడా గవర్నర్ అప్పట్లో తప్పుపట్టడమేగాక ఆ సమావేశాలలో ఆమోదించిన కీలక బిల్లులను తన వద్ద పెండింగ్‌లో ఉంచారు. వీటిలో సిక్కు గురుద్వారాల సవరణ బిల్లు, 2023, పంజాబ్ అనుబంధ కళాశాలల(భద్రతా సర్వీసు) సవరణ బిల్లు, పంజాబ్ యూనివర్సిటీల చట్టలు(సవరణ) బిల్లు, వంటివి ఉన్నాయి. ఇవి ఇప్పటికీ గవర్నర్ ఆమోదానికి నోచుకోలేదు.
ఈ నెల 20, 21 తేదీలలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలలో సట్లజ్ యమునా లింక్ కెనాల్ వివాదానికి సంబంధించిన అంశంపై చర్చించడంతోపాటు ఇటీవలనే కన్నుమూసిన హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు నివాళులర్పించడం, జిఎస్‌టి చట్టంపై సవరణల బిల్లు, తన రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడాన్ని నిరసిస్తూ చర్చించడం వంటి అంశాలు ఉన్నాయి.