Wednesday, January 22, 2025

పంజాబ్ గవర్నర్ బరితెగింపు!

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మతితప్పిన గవర్నర్ల జాబితాలో పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌ది ఒకింత శ్రుతిమించిన వైఖరి ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలను తూలనాడి, బెదిరింపులకు హెచ్చరికలకు గురిచేసి తమ అజ్ఞానాన్ని చాటు కోవడంలో మిగతా వారికంటే ఈయన రెండాకులు ఎక్కువే చదువుకొన్నానని చాటుకొన్నారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధింపజేస్తానని, ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను జైల్లో పెట్టిస్తానని బెదిరించేవరకు వెళ్లారు. తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమయిందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేయగలనని హెచ్చరించారు. అంతటితో ఆగలేదు. రాష్ట్రపతి, గవర్నర్ పై దాడికి సమకట్టినందుకు భారత శిక్షాస్మృతి 124 సెక్షన్ కింద కేసు దాఖలు చేయగలనని బెత్తం ఝళిపించారు. రాతపూర్వకంగా గాని నోటిమాటతో గాని, సైగలతో గాని గవర్నర్ పట్ల విద్వేషాన్ని ప్రదర్శించేవారికి యావజ్జీవ శిక్షను, జరిమానాను లేదా కనీస పక్షం మూడేళ్ళ జైలు, జరిమానాను విధించవచ్చు.

సాధారణ పౌరుల విషయంలో ఇటువంటి శిక్షలను విధింపజేస్తామని అరుదుగానైనా హెచ్చరించడాన్ని ఊహించలేము. అటువంటిది ప్రజలు ఎన్నుకొన్న ముఖ్యమంత్రిని గవర్నర్ ఈ విధంగా హెచ్చరించడాన్ని ఏమనాలి? కేంద్ర పాలకులకు ప్రజాస్వామ్యంపై నామమాత్రపు గౌరవం సైతం లేనప్పుడే దాని గవర్నర్లు ఇలా వీధికెక్కి వీరంగం వేయగలరని అనుకోవలసి ఉంది. రాజ్యాంగం 356 అధికరణ కింద రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయగలనని గవర్నర్ బెదిరించడం ఇటీవలి కాలంలో ఏ రాష్ట్రం లోనూ జరగలేదు. పంజాబ్‌లో మాదక ద్రవ్యాల వినియోగానికి సమ్మంధించి తాను అడిగిన సమాచారాన్ని ముఖ్యమంత్రి తనకు పంప లేదని గవర్నర్ ఆరోపించారు.ఈ విషయంలో ఈ నెల 1వ తేదీన తాను ముఖ్యమంత్రికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోయిందని అందుచేతనే మళ్ళీ రాయవలసి వస్తున్నదని పేర్కొంటూ ఇప్పటికీ మీరు నాకు సమాచారం ఇవ్వడం లేదని, దానిని ఇవ్వడానికి ఉద్దేశ పూర్వకంగా తిరస్కరించడం గానే భావించవలసి వస్తున్నదని గవర్నర్ పురోహిత్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగం 167 అధికరణ కింద రాష్ట్ర పాలనా వ్యవహా రాలకు సమ్మంధించి గవర్నర్ అడిగే సమాచారాన్ని అందించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి పై ఉన్నదని అందులో మీరు విఫలమయ్యారని పురోహిత్ తన లేఖలో తెలియజేశారు. ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతికి నివేదిక పంపించడానికి ముందు మరో అవకాశమిస్తున్నానని కూడా హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవహారాన్నైనా తెగేవరకు లాగకూడదు. దీనిని కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో తప్పనిసరిగా పాటించవలసిన అవసరమున్నది. ఎందుకంటే కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నట్టే రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను అదే ప్రజలు ఎన్నుకొంటారు. ఇదే సమాఖ్య వ్యవస్థలోని గొప్ప లక్షణం. రెండు ప్రభుత్వాల వెనుకా ప్రజలే ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగా ఉండే గవర్నరు రాజ ప్రతినిధి మాదిరిగా వ్యవహరించకూడదు. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ నడచుకోవాలి. గవర్నర్ హెచ్చరికను పంజాబ్ రాష్ట్ర ప్రజలను అవమానించడంగానే ముఖ్యమంత్రి మాన్ పరిగణిం చారు. రాష్ట్రపతి పాలనను ముందుగా మణిపూర్ లోనో, గుజరాత్ లోనో విధించండని ఆమ్ ఆద్మీ పార్టీ హితవు చెప్పింది. మణిపూర్‌లో రాజ్యాంగ యంత్రాంగం విఫలమై చాలా కాలమైంది. ఇప్పటికీ అక్కడ శాంతి నెలకొనలేదు. జాతుల మధ్య ద్వేషాగ్ని చల్లారలేదు.

అక్కడి పరిస్థితితో పోలిస్తే పంజాబ్ ఎంతో మెరుగు. ప్రజాస్వామ్య ప్రక్రియకు ఎటువంటి విఘాతం కలుగ లేదు. ఆప్ అంటే ఎందుకో కేంద్రంలోని బిజెపి పాలకులకు కడుపు మంటగా వున్నది. ఆప్ అనతి కాలంలో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం దానికి బొత్తిగా గిట్టడం లేదు. దానిని రాజకీయంగా ఎదుర్కోవాలే గాని రాజ్యాంగ ఉల్లంఘన ద్వారా కాదు. పంజాబ్‌లో మాదక ద్రవ్యాల సమస్య ఇప్పటిది కాదు. 2013లోనే పదవి నుంచి తొలగించిన డిఎస్‌పి జగదీష్ సింగ్ బోలాను డ్రగ్స్ అక్రమ రవాణాకు సమ్మంధించి అరెస్టు చేశారు.పంజాబ్‌లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదార్లకు రాజకీయ నాయకుల రక్షణ ఉందని, కొంత మంది నాయకులు స్వయంగా అందులో తలమునకలై ఉన్నారని ఇండియన్ కౌన్సిల్ అఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధన మండలి) జరిపిన పరిశోధనలో తేలింది.పంజాబ్ లో డ్రగ్స్ వినియోగం అవధులు మీరి సాగుతున్న మాట వాస్తవం. అయితే అందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్నే తప్పు పట్టడానికి వీల్లేదు. ఈ విషయాన్ని పార్టీల మధ్య గల రాజకీయ విభేదాల అద్దంలో చూడడం, గవర్నర్లు రాష్ట్రపతి పాలన కమ్చీ ఝళిపించడం ఎంత మాత్రం సమంజసం కాదు. ప్రభుత్వ సారాయి దుకాణల్లోనే డ్రగ్స్ అమ్ముతున్నట్టు గవర్నర్ పురోహిత్ ఆరోపించారు. ఇది గుడ్డ కాల్చి ఆప్ ప్రభుత్వం మీద వెయ్యడంగా భావించాలా, దానిని బలి తీసుకొనే కుట్ర ఇందులో దాగొని ఉందా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News