పంజాబ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 2 గం. వరకే కార్యాలయాలు
రెండున్నర నెలల వరకు ఒంటిపూట కార్యాలయాలు
చండీగఢ్: వేసవిలో ఒంటిపూట బడులు మాదిరిగానే పంజాబ్ ప్రభుత్వం వేసవి, విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తమ కార్యాలయాలను ఒంటిపూట కార్యాలయాల మాదిరిగా పనివేళలను మార్చింది. మామూలుగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలకు ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనివేసేలా మంగళవారం నుంచి అమలు లోకి తెచ్చింది. లంచ్‌బ్రేక్ 30 నిమిషాలు. ఇంకా ఇదివరకటి కన్నా ఒక గంట తక్కువగానే ఉద్యోగులు పనిచేస్తారు. ఈ పనివేళల మార్పు గురించి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మంగళవారం వివరించారు.దీనివల్ల కేవలం విద్యుత్ ఆదా కావడమే కాక, ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయని చెప్పారు. కొత్త పనివేళలు జులై 15 వరకు అమలులో ఉంటాయన్నారు.
ఈ రెండున్నర నెలల సమయంలో రూ. 40 కోట్ల నుంచి 42 కోట్ల వరక ఆదా అవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన సిబ్బందితో కలిసి సివిల్ సెక్రటేరియట్‌కు మంగళవారం ఉదయం 7.28 కే విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. కొత్త పనివేళల వల్ల సూర్యకాంతిని ప్రభుత్వ కార్యాలయాల్లో గరిష్ఠంగా వినియోగించడమౌతుందని చెప్పారు. ఉద్యోగులు, ప్రజలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసినప్పుడు ఆవరణ లోని విద్యుత్ పరికరాల వినియోగం కూడా పూర్తిగా మూతపడుతుందని, ఫలితంగా రోజుకు 350 మెగావాట్ల వరకు వినియోగం తగ్గుతుందని, నెలకు రూ.16 కోట్లు నుంచి 17కోట్ల వరకు విద్యుత్ బిల్లులు ఆదా ఆవుతాయన్నారు. జులై 15 వరకు రూ. 40 నుంచి 42 కోట్ల వరకు ఆదా ఆవుతుందని తెలిపారు.
కేవలం విద్యుత్ ఆదా కోసమే ఈ నిర్ణయం తీసుకలోలేదని, రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు లోటు లేదని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో వాతావరణ కార్యాలయం అంచనా ప్రకారం అత్యంత వేడి వాతావరణం ఉంటుందని, ఉదయం 7.30 కే కార్యాలయాలు తెరిస్తే ప్రజలు కూడా వేగంగా తమ పనులు పూర్తి చేసుకోగలుగుతారని చెప్పారు. విద్యుత్ విభాగం వివరాల ప్రకారం విద్యుత్ వినియోగం గరిష్ఠంగా మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. అలాంటప్పుడు కొత్త పనివేళలు విద్యుత్ వినియోగ భారాన్ని తగ్గించడానికి దోహదపడతాయని సిఎం తెలిపారు. పరిశ్రమలకు కానీ, ఇళ్లకు కానీ విద్యుత్ కోత ఉండబోదని ముఖ్యంగా గమనించాలన్నారు.
Also Read: వరల్డ్ టాప్ స్మార్ట్ సిటీస్ జాబితాలో హైదరాబాద్ ఎక్కడుందంటే…