Sunday, January 19, 2025

పంజాబ్ ప్రభుత్వం యూటర్న్… వివిఐపిలకు మళ్లీ భద్రత

- Advertisement -
- Advertisement -

Punjab govt To Restore VVIPs Security

చండీగఢ్ : సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యోదంతం నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. 424 మందికి పైగా వీవీఐపీలకు భద్రత పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 7 నుంచి వీవీఐపీలకు సెక్యూరిటీ అందుబాటు లోకి వస్తుందని పంజాబ్, హర్యానా హైకోర్టుకు ఆప్ ప్రభుత్వం తెలియజేసింది. భద్రత తొలగింపుపై మాజీ మంత్రి ఓపీ సోనీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు చెప్పింది. వివిఐపిలకు భద్రత ఎందుకు తొలగించాల్సి వచ్చిందని హైకోర్టు ప్రశ్నించగా, జూన్ 6న ఆపరేషన్ బ్లూస్టార్ వార్షిక దినం నేపథ్యంలో భద్రతాసిబ్బంది అవసరం ఏర్పడిందని ఆప్ ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకుంది.

కాగా 1984 లో స్వర్ణ దేవాలయంలో తిష్ఠ వేసిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించిన విషయం విదితమే. సిద్ధూ హత్య జరిగిన ఐదు రోజుల తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిఐపిలకు భద్రత ఉపసంహరించడం, ఆ మరుసటి రోజే సింగర్ సిద్ధూ దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఆందోళనలు చేపట్టాయి. భద్రత ఉపసంహరణ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఆప్ ప్రభుత్వం ఈ వెనుకడుగు వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News