Friday, January 3, 2025

సన్‌రైజర్స్‌కు సవాల్ నేడు పంజాబ్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. పంజాబ్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో హైదరాబాద్ బలహీనంగా కనిపిస్తోంది. లక్నోతో జరిగిన కిందటి మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.

కెప్టెన్ మార్‌క్రమ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. వేలం పాటలో కోట్లాది రూపాయలు వెచ్చించి సొంతం చేసుకున్న హారి బ్రూక్ కూడా ఆడిన రెండు మ్యాచల్లోనూ తెలిపోయాడు. జట్టును ముందుండి నడిపిస్తాడని భావించిన మార్‌క్రమ్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. మయాంగ్ అగర్వాల్ కూడా స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నాడు. రెండు మ్యాచుల్లోనూ మయాంక్ విఫలమయ్యాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా తయారైంది. పంజాబ్ మ్యాచ్‌లోనైనా మయాంక్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన మయాంక్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది.

మిగిలిన మ్యాచుల్లోనైనా మయాంక్ రాణిస్తాడా లేదా అనేది ఆందోళన కలిగిస్తోంది. బ్రూక్ కూడా బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోక తప్పదు. తొలి రెండు మ్యాచుల్లో బ్రూక్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌లో మాత్రం మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక జట్టులోనే అత్యంత కీలక బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న రాహుల్ త్రిపాఠి కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా తయారైంది. ఇప్పటికైనా రాహుల్ తన బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోక తప్పదు. అబ్దుల్ సమద్, వికెట్ కీపర్ అన్మోల్‌ప్రీత్ సింగ్, వాషింగ్టన్ సుందర్, ఆదిల్ రషీద్, భువనేశ్వర్ కుమార్ తదితరులు బ్యాటింగ్‌లో రాణించాల్సి ఉంటుంది. ఓపెనర్లతో పాటు టాపార్డర్ రాణిస్తే హైదరాబాద్ బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి.

అందరి కళ్లు మార్‌క్రమ్‌పైనే..

ఇదిలావుంటే ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు స్టార్ ఆటగాడు, కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్‌పైనే నిలిచాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన మార్‌క్రమ్ విజృంభిస్తే సన్‌రైజర్స్‌కు భారీ స్కోరు కష్టం కాదు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద సృష్టిస్తున్న మార్‌క్రమ్ ఐపిఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో సున్నాకే ఔటై నిరాశ పరిచాడు. పంజాబ్ మ్యాచ్‌లో అతను తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఉంది.

జోరుమీదున్న కింగ్స్

మరోవైపు పంజాబ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. కెప్టెన్ శిఖర్ ధావన్, రాజపక్స, శామ్ కరన్, నాథన్ ఎల్లిస్,షారూక్ ఖాన్, సికందర్ రజా, జితేశ్ శర్మ తదితరులతో బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక అర్ష్‌దీప్, శామ్ కరన్, రాహుల్ చాహర్, కగిసో రబడా వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉండనే ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News