షమి, బిష్ణోయి మ్యాజిక్, రాణించిన గేల్, రాహుల్ n కింగ్స్ ఘన విజయం
చెన్నై : ఐపిఎల్ సీజన్14లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో డిఫెండింగ్ చాంపియన్ ముంబైని చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన పంజాబ్ 17.4 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (25)తో కలిసి కెప్టెన్ కెఎల్ రాహుల్ జట్టుకు శుభారంభం అందించాడు. తర్వాత వచ్చిన గేల్ 35 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 43 (నాటౌట్)తో కలిసి రాహుల్ జట్టును గెలిపించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 52 బంతుల్లో మూడు సిక్స్‌లు, 3 ఫోర్లతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఆదుకున్న రోహిత్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. పంజాబ్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో ముంబై బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే క్రమంలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (3) పరుగులు మాత్రమే పెవిలియన్ చేరాడు. దీపక్ హుడా బౌలింగ్‌లో డికాక్ పెవిలియన్ చేరాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా నిరాశ పరిచాడు. 17 బంతుల్లో కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసిన ఇషాన్‌ను రవి బిష్ణోయి వెనక్కి పంపాడు. దీంతో ముంబై 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత కెప్టెన్ రోహిత్ శర్మ తనపై వేసుకున్నాడు.
అతనికి సూర్యకుమార్ యాదవ్ అండగా నిలిచాడు. ఇద్దరు పంజాబ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ స్కోరును నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చాలా సేపటి వరకు వేచి చూడాల్సి వచ్చింది. చివరికి రవి బిష్ణోయి ఈ నిరీక్షణకు తెరదించాడు. కుదురుగా ఆడుతున్న సూర్యకుమార్‌ను అతను ఔట్ చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ మూడు ఫోర్లు, సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు. ఆ వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఔటయ్యాడు. 5 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 63 పరుగులు చేసిన రోహిత్‌ను షమి పెవిలియన్ బాట పట్టించాడు. ఇక పొలార్డ్ 16 (నాటౌట్) కాస్త రాణించడంతో ముంబై స్కోరు 131 పరుగులకు చేరింది. ఇక పంజాబ్ బౌలర్లలో షమి, బిష్ణోయి రెండేసి వికెట్లు పడగొట్టారు.