లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవ ఎన్నిక, నేడు ప్రమాణస్వీకారం
పంజాబ్‌కు తొలి దళిత ముఖ్యమంత్రి
చండీగఢ్ : చరణ్‌జిత్ సింగ్ చన్నీ పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ నేతల సమక్షంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా తరువాత కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆదివారం హుటాహుటిన నాయకత్వ ఖాళీ ప్రక్రియను ఆరంభించింది. ఆదివారం ఉదయం నుంచి సంబంధిత ప్రక్రియపై భారీ స్థాయిలో మంతనాలు జరిగాయి. తరువాత అనూహ్యరీతిలో చరణ్‌జిత్ ఎన్నిక జరిగింది. ఆయన సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడైంది. తొలుత సీనియర్ కాంగ్రెస్ నేత సుఖ్‌జిందర్ సింగ్ రంధావా సిఎం అవుతారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే పిసిసి అధ్యక్షులు నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, పిసిసి మాజీ నేత సునీల్ జక్కర్ల పేర్లు కూడా విన్పించాయి.
అయితే సాయంత్రానికి పరిస్థితి మారింది. లెజిస్లేచర్ పార్టీ భేటీలో అనూహ్యంగా చన్నీ పేరును ప్రతిపాదించారు. 58 సంవత్సరాల చన్నీ దళిత సామాజిక వర్గానికి చెందిన నేత. కెప్టెన్ అమరిందర్ సింగ్ కేబినెట్‌లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఛామ్కూర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తరఫున పరిశీలకులుగా వచ్చిన హరీష్ రావత్, అజయ్ మకెన్, హరీష్ చౌదరిల సమక్షంలోనే సిఎల్‌పిలో ఎన్నిక ప్రక్రియ జరిగింది. చన్నీ పేరును ప్రకటించగానే దీనికి మాజీ సిఎం అమరీందర్ సింగ్, రంధావా మద్దతు ప్రకటించారు. సిఎల్‌పి నేతగా ఎన్నికయిన తరువాత చన్నీ కొందరు నేతలు, ఎమ్మేల్యేలతో కలిసి రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌ను కలిశారు. ప్రభుత్వ స్థాపనకు ఆయనకు అవకాశం ఇవ్వాలని తెలిపారు. స్థానిక ఫైవ్‌స్టార్ హోటల్‌లో మకాం వేసిన కాంగ్రెస్ ఢిల్లీ నేతలు పార్టీలోని రెండు మూడు కోణాల ప్రముఖులను పిలిపించి మాట్లాడారు. ముందు ప్రచారంలోకి వచ్చిన రంధావే విషయంలో కొన్ని అభ్యంతరాలు వెలువడ్డాయి. మరోవైపు సిద్ధూ విషయంలో అమరీందర్ వర్గం నుంచి గట్టి వ్యతిరేకత తలెత్తింది. అన్నింటికి మించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి దళిత సిఎం అభ్యర్థితో ప్రచారంలోకి దిగుతుందనే వాదన తలెత్తింది. దీనిని పరిగణనలోకి తీసుకుని, అన్ని వర్గాలను ఒప్పించి చన్నీ పేరు ప్రతిపాదించినట్లు వెల్లడైంది. సిద్ధూకు సన్నిహితుడు అయిన సీనియర్ నేత బ్రహ్మ్ మెహీంద్రా కూడా చన్నీ ఎన్నికను బలపర్చారు.
కేడర్ నేత చన్నీ
సామాజికంగా అట్టడుగు స్థాయిలో అందరితో కలివిడిగా ఉంటారని పేరు తెచ్చుకున్న చన్నీ 2000 సంవత్సర ప్రాంతంలో ఖరార్ నుంచి కాంగ్రెస్ తరఫున స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచారు. తరువాత కాంగ్రెస్‌కు ఎదురుతిరిగి ఇండిపెండెంట్‌గా అసెంబ్లీ ఎన్నికలలో గెలిచారు. అప్పట్లో శిరోమణి అకాలీదళ్ అనుబంధ సభ్యులుగా ఉన్నారు. తరువాత 2010లో అమరీందర్ సింగ్ వెన్నుదన్నులతో కాంగ్రెస్‌లో చేరారు. తరువాత మంత్రి అయ్యారు. 2018 అక్టోబర్‌లో ఆయనపై ఓ మహిళా ఐఎఎస్ ఆఫీసర్ లైంగిక అనుచిత ప్రవర్తనల సందేశం ఆరోపణలకు దిగారు. లైంగిక వేధింపుల కేసు పెట్టేందుకు రంగం సిద్ధం అయినా నిలిచిపోయింది. రాజకీయ కారణాలతోనే అభియోగాలు వచ్చాయని కొట్టిపారేసిన చన్నీ అమరీందర్ కేబినెట్లో కీలక పాత్ర పోషించారు. వ్యవస్థలో మార్పు రావాలని కోరుకునే ఆయన తన కారు తానే డ్రైవ్ చేసుకుని వెళ్లుతారు. టోల్‌టాక్స్ స్వయంగా చెల్లించే సాదాసీదా నేతగా పేరొందారు.