Monday, December 23, 2024

కర్నాటక స్కీంకు పంజాబ్ బియ్యం?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎఫ్‌సిఐ ద్వారా రాష్ట్రాలకు బియ్యం సరఫరాల నిలిపివేతకు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కాంగ్రెస్, ఆప్ మధ్య సఖ్యతకు దారితీస్తోంది. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం జులై 1 నుంచి ఎన్నికల వాగ్దానం మేరకు రాష్ట్రంలో నిరుపేదలకు ఉచిత బియ్యం పథకం అన్నభాగ్యస్కీంను అమలు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎఫ్‌సిఐ నుంచి 2.28 లక్షల మెట్రికల్ టన్నుల బియ్యాన్ని సేకరించాలని ముందు అనుకున్నారు.

ఈ ప్రతిపాదనకు ఎఫ్‌సిఐ అనుమతి ఈ నెల 13వ తేదీన ఇచ్చింది. అయితే మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం దేశంలో బియ్యం ధరల స్థిరీకరణ, కోటా నిల్వల పెంపుదల పేరిట ఎఫ్‌సిఐ నుంచి బియ్యం కోటా రాష్ట్రాలకు ఉండదని పేర్కొంటూ కీలక ఆదేశాలు వెలువరించింది. దీనితో కేంద్రం వద్దకు కర్నాటక మంత్రులు చివరికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా వెళ్లారు. బియ్యం సరఫరాకు వీలు కల్పించాలని కోరారు. ఈ దశలోనే పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ఈ బియ్యం తమ రాష్ట్రం నుంచి తీసుకోవచ్చునని, ఇందుకు తాము సిద్ధం అని తెలిపింది.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పంజాబ్ సిఎం భగవంత్ మాన్ బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. మొత్తం కోటాను తమ రాష్ట్రం నుంచి తీసుకోవచ్చునని ఆప్ తెలిపింది. దీనిపై కర్నాటక ఇప్పుడు పరిశీలనలు జరుపుతోంది. ఈ నెల 23న పాట్నాలో జరిగే ప్రతిపక్ష పార్టీల కీలక సదస్సు నేపథ్యంలో ఇంతవరకూ అటూ ఇటూగా ఉన్న ఆప్, కాంగ్రెస్ మధ్య ఇప్పుడు బియ్యంతో రాజకీయ వియ్యం తద్వారా ప్రతిపక్ష ఐక్యతా దిశలో కీలకమైన ముందడుగుకు వీలుందని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News