న్యూఢిల్లీ: నవజోత్‌సింగ్ సిద్ధు పంజాబ్ పిసిసి అధ్యక్ష పదవికి ఇచ్చిన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. అయితే, ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా కొత్త వ్యక్తిని నియమించిన తర్వాతే పార్టీ ఆఫీస్‌కు వెళ్తానని సిద్ధు తెలిపారు. రాహుల్‌గాంధీతో మూడు వారాల క్రితం సమావేశమైన సిద్ధు తన రాజీనామాకు కారణాలను వివరించారు. అడ్వొకేట్ జనరల్ పదవి నుంచి ఎపిఎస్ డియోల్‌ను తొలగించాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. 2015లో గురుగ్రంథ్ సాహిబ్‌కు అవమానం జరగడం, అందుకు నిరసన తెలిపిన ఆందోళనకారులపై కాల్పులు జరపడంలో ఆరోపణులున్న ఇద్దరు పోలీస్ అధికారులకు ఎపిఎస్ డియోల్ న్యాయవాదిగా వ్యవహరించారని సిద్ధు అంటున్నారు. సిద్ధు విమర్శల నేపథ్యంలో డియోల్ తన పదవికి రాజీనామా చేయగా, ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్ ఆమోదించకపోవడం గమనార్హం. 2015 సంఘటనల్లో నిందితుడిగా ఉన్న పంజాబ్ మాజీ పోలీస్ చీఫ్ సుమేధ్‌సయినీకి డియోల్ న్యాయవాదిగా వ్యవహరించి, బెయిల్ ఇప్పించారు. ప్రస్తుతం పంజాబ్ పోలీస్ చీఫ్‌గా ఉన్న సహోటాను ఆ పదవి నుంచి తొలగించాలనేది కూడా సిద్ధు డిమాండ్. 2015 సంఘటనలపై అప్పటి అకాలీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు సహోటా నేతృత్వం వహించారు.
రాజీనామాను వెనక్కి తీసుకున్న పంజాబ్ పిసిసి చీఫ్ సిద్ధు
- Advertisement -
- Advertisement -
- Advertisement -