పంజాబ్: గత 35 రోజులగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అమృత్ పాల్ సింగ్ ను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం అమృత్ పాల్ భార్యను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అమృత్ పాల్ ను మోగా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అమృత్ పాల్ సింగ్ “వారిస్ పంజాబ్ దే” సంస్థ వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. అమృత్ పాల్ పంజాబ్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టినట్లు సమాచారం. ఇతను పంజాబ్ లో ఖలిస్థానీ కార్యకలాపాలను సాగించాడు. అల్లర్లు సృష్టించినట్లు పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ పై కేసులు పెట్టారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మార్చి 18 నుంచి అమృత్ పాల్ పరారీలో ఉన్నాడు. ఖలిస్థానీ అనుకూల నాయకుడిని అస్సాంలోని దిబ్రూఘర్ జైలుకు తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అమృతపాల్ సింగ్ మరో ఇద్దరు సహాయకులు పంజాబ్‌లోని మొహాలీలో ఏప్రిల్ 18న పంజాబ్, ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేయబడ్డారు.