Wednesday, January 22, 2025

పంజాబ్‌లో ఖలీస్థానీలపై పంజా..

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : పంజాబ్ పోలీసులు సోమవారం తెల్లవారుజాము నుంచి ఖలీస్థానీ ఉగ్రవాదుల ఆటకట్టుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ఐఎస్‌ఐ మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఖలీస్థానీ తీవ్రవాది లక్బీర్ సింగ్ సంధూ అలియాస్ లండాకు చెందినవని భావిస్తున్న దాదాపు 48 స్థావరాలపై దాడికి దిగారు. విస్తృతస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా లండా అనుచరులుగా భావిస్తున్న పలువురని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో సోదాలు చేపట్టారు. లండా, హర్వీందర్ సింగ్ సంధూ అలియాస్ రిండా కలిసి తమ అనుచరులతో కలిసి, పాకిస్థానీ గూఢచార్య సంస్థ (ఐఎస్‌ఐ) వెన్నుదన్నులతో కార్యకలాపాలు సాగిస్తోందని అభియోగాలు ఉన్నాయి. అత్యంత ప్రమాదకరమైన బబ్జర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బికెఐ) కార్యకలాపాలు ఇండియాలో సాగేలా చేస్తున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (నియా) నిర్థారించింది.

ఈ ఇద్దరి కదలికలపై ఇప్పుడు నియా పూర్తి స్థాయిలో నిఘా వేసి ఉంచింది. రిండాలిండాలు ఇద్దరూ పాకిస్థాన్‌లో మకాం వేసుకుని తీవ్రవాద చర్యలకు దిగుతున్నారు. వీరిని వాంటెడ్ నేరస్తులుగా ఇప్పటికే నియా , భద్రతా సంస్థలు ప్రకటించాయి. పలు వ్యూహాలు ద్వారా నిర్ణీత హత్యలకు పాల్పడటం, భద్రతా సంస్థలపై దాడులకు దిగడం, పంజాబ్‌లో భయోత్పాతం కల్పించడం ఈ ఇద్దరి చర్యగా మారింది. వీరు బికెఐ సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే రిండా ఉగ్రవాదుల జాబితాలో చోటుచేసుకున్నాడు. నాందేడ్ స్థానికుడైన రిండా తన శాశ్వత చిరునామాను పంజాబ్‌లోని తరన్‌తరన్‌గా పేర్కొంటూ వస్తున్నాడు. లండా కూడా తరన్‌తరన్ వాసిగా నమోదు అయి ఉన్నాడు. ప్రస్తుతం కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాదుల కార్యకలాపాలకు పంజాబ్‌లోని కొన్ని అజ్ఞాత ఖలీస్థానీ శక్తులు తోడ్పాటు అందిస్తున్నాయనే అభియోగాలు ఉన్నాయి.

కెనడా భారతదేశాల నడుమ ఇప్పటికే ఖలీస్థానీ వ్యవహారం పూర్తి స్థాయిలో దౌత్య సంబంధాలను దెబ్బతీసింది. ఈ దశలోనే పలువురు ఖలీస్థానీ ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఖలీస్థానీ నేతల ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పుడు సోమవారం ఒక్కరోజు ఒకేసారి పంజాబ్‌లో 48 చోట్ల దాడులకు దిగడం సంచలనం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News