Sunday, January 19, 2025

అమృత్‌పాల్ సింగ్ కోసం నాలుగో రోజూ వేట!

- Advertisement -
- Advertisement -

అమృత్‌పాల్ సింగ్ కోసం నాలుగో రోజూ వేట!
కారు, దుస్తులు సీజ్ చేసిన పోలీసులు
బైక్‌పై పంజాబ్ దాటేశాడని అనుమానిస్తున్న నిఘావర్గాలు
సింగ్ మామ హర్జీత్‌సింగ్‌పై ఎన్‌ఎస్‌ఎ కేసు నమోదు
చండీగఢ్: ఖలీస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్‌సింగ్ కోసం నాలుగో రోజూ పోలీసులు వేట కొనసాగించారు. సింగ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు నుంచి తప్పించుకునే క్రమంలో అమృత్‌పాల్ సింగ్ ఉపయోగించిన బ్రెజా కారు, దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సింగ్ పంజాబ్ సరిహద్దులు దాటేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తనకోసం వేటాడుతున్నారని సమాచారం అందగానే అమృత్‌పాల్ సింగ్ తన మెర్సిడెస్ వాహనాన్ని వదిలేసి బ్రెజా కారులో మరో మార్గంలో షాకోట్‌కు పరారయ్యాడు. తనిఖీల్లో భాగంగా సింగ్ కారును గుర్తించి దుస్తులుతోపాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అమృత్‌పాల్ సింగ్ కారును వదిలి పంజాబ్ సరిహద్దులను దాటి పారిపోయాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. నేపాల్ చేరుకుని అక్కడనుంచి కెనడాకు సింగ్ పారిపోయే అవకాశముందని వర్గాలు పేర్కొన్నాయి.

114మంది అనుచరుల అరెస్టు
అమృత్‌పాల్ పోలీసులు నుంచి తప్పించుకుని పారిపోయేందుకు సహకరించిన అతడి అనుచరులు 114మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్ (ఎకెఎఫ్)ఉపయోగించే ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.ఈ క్రమంలో సింగ్ మామ హర్జీత్‌సింగ్, డ్రైవరు హర్‌ప్రీత్‌సింగ్ జలంధర్‌లో పోలీసులు ఎదుట స్వయంగా లొంగిపోయారు. వీరిపై జాతీయ భద్రత చట్టం (ఎన్‌ఎస్‌ఎ)ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు హర్జీత్‌ను అసోంలోని దిబ్రూగడ్ జైలుకు తరలించారు. హర్జీత్‌తోపాటు మరో నలుగురు అనుచరులు దల్జీత్‌సింగ్, భగవంత్‌సింగ్, గుర్మీత్‌సింగ్, ‘ప్రధానమంత్రి’ బజేకాలపై ఎన్‌ఎస్‌ఎ కేసు నమోదైంది.

ఇంటర్నెట్ ఆంక్షల సడలింపు
పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్టా ఇంటర్నెట్‌పై విధించిన ఆంక్షలు ఈ నెల 23వరకూ కొనసాగనున్నాయి. అయితే మంగళవారం మొబైల్ ఇంటర్‌నెట్‌పై ఆంక్షలను పంజాబ్ ప్రభుత్వం సడలించింది. కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. తరన్ తరన్, ఫిరోజ్‌పూర్, మోఘా, సంగ్రూర్, అమృత్‌సర్ అజ్‌నాలా సబ్ డివిజన్, మొహాలీలోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకూ ఇంటర్నెట్‌పై ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఆంక్షలును ఎత్తివేయనున్నట్లు హోం వ్యవహారాలు, న్యాయశాఖ ఉత్తర్వుల్లో తెలిపింది.

అన్ని మొబైల్ ఇంటర్నెట్ సేవలు, ఎస్‌ఎంఎస్‌లు, డాంగిల్ సేవలను మార్చి మధాహ్నం వరకు తరన్ తరన్, ఫిరోజ్‌పూర్, మోగా, సంగూర్, అమృత్‌సర్‌లోని అజ్నాలా సబ్ డివిజన్‌ల్లో నిలిపివేయనున్నారు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో పంజాబ్ వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. కాగా సిక్కులకు ప్రత్యేక దేశం కోరుతూ చేపట్టిన ఖలిస్థాన్ ఉద్యమానికి గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ సహకరిస్తోందని వర్గాలు అంచనా వేస్తున్నాయి. పంజాబ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుఖ్‌చైన్‌సింగ్ గిల్ విలేఖరులతో మాట్లాడుతూ అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకునే ప్రయత్నాల్లో ప్రత్యేక పోలీస్ విభాగాలు పాల్గొంటున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News