పఠాన్‌కోట్ (పంజాబ్): కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలపై ప్రధాని మోడీ బుధవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. పంజాబ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ కూటమి తరఫున ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేరాల్లో భాగస్వాములని, పంజాబ్‌కు కాంగ్రెస్ మాదక ద్రవ్యాల జాఢ్యాన్ని తీసుకొచ్చిందని, ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీ యువతను మద్యంలో ముంచేందుకు ప్రయత్నిస్తోందని తీవ్రంగా ఆరోపించారు. పఠాన్‌కోట్‌లో ఉగ్రవాద దాడి తరువాత మనసైనికుల ధైర్యసాహసాలను, శక్తి సామర్ధాలను కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారని గుర్తు చేశారు. అమరవీరుల కీర్తిప్రతిష్ఠలను దెబ్బతీస్తున్నారన్నారు. పుల్వామాలో సైనిక వాహనంపై ఉగ్రదాడి సమయంలో మన సైనికుల ధైర్యసాహసాలను కూడా ప్రశ్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు మరోసారి అవకాశం ఇస్తే పంజాబ్ భద్రతను ప్రమాదం లోకి నెట్టేస్తుందని హెచ్చరించారు. 1984 లో సిక్కులపై జరిగిన దాడుల నిందితులను బీజేపీ ప్రభుత్వం కటకటాల వెనక్కునెట్టిందన్నారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు కర్తార్‌పూర్ సాహెబ్ ను పాకిస్థాన్‌లో కలపడంతో కాంగ్రెస్ పాత్రను ప్రశ్నించారు. 1965 యుద్ధ సమయంలో కూడా దీన్ని వెనక్కు తీసుకోడానికి కాంగ్రెస్ ప్రయత్నించలేదన్నారు. తాము ఎక్కడ గెలిచినా రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని తొలగిస్తామని, తాము నూతన పంజాబ్‌ను తీర్చిదిద్దుతామని చెప్పారు. సంత్ రవిదాస్ సిద్ధాంతాలను కేంద్ర ప్రభుత్వం పాటిస్తోందన్నారు. అంతకు ముందు మోడీ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఉన్న శ్రీగురు రవిదాస్ విశ్రామ్ రామ్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.
Punjab Polls 2022: PM Modi slams Congress