Saturday, November 23, 2024

పంజాబ్ శుభారంభం

- Advertisement -
- Advertisement -

మొహాలీ: ఐపిఎల్‌లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట అక్కడే నిలిచిపోయింది. వర్షం తగ్గక పోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చారు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి మెరుగైన స్థితిలో నిలిచిన పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. అర్ష్‌దీప్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో మన్‌దీప్ సింగ్ (2), అనుకుల్ రాయ్ (4)లు వెనుదిరిగారు.

కొద్ది సేపటికే ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (22) కూడా ఔటయ్యాడు. 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 22 పరుగులు చేసిన గుర్బాజ్‌ను నాథన్ ఎల్లిస్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో కోల్‌కతా 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిది. ఈ దశలో వెంకటేష్ అయ్యర్, కెప్టెన్ నితీష్ రాణా కొద్ది సేపు పోరాటం చేశారు. ధాటిగా ఆడిన నితీష్ 3 బౌండరీలు, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసి సికందర్ రజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఆండ్రీ రసెల్ 19 బంతుల్లోనే 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేసి వెనుదిరిగాడు. వెంకటేశ్ అయ్యర్ 34 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కాగా, కోల్‌కతా స్కోరు 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం మొదలైంది. ఆ తర్వాత ఆటను అక్కడే నిలిపి వేశారు. ఇక పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ 3 వికెట్లు తీశాడు.

మెరుపు ఆరంభం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్‌లు శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన సిమ్రాన్ సింగ్ 12 బంతుల్లోనే రెండు సిక్స్‌లు, మరో 2 ఫోర్లతో 23 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ ధావన్ 29 బంతుల్లో ఆరు ఫోర్లతో 40 పరుగులు సాధించాడు. మరోవైపు భానుక రాజపక్స కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. చెలరేగి ఆడిన రాజపక్స 32 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగలు చేశాడు. జితేష్ శర్మ (21), శామ్ కరన్ 26 (నాటౌట్)లు కూడా మెరుపులు మెరిపించడంతో పంజాబ్ స్కోరు 191 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News