మొహాలి: ఐపిఎల్ సీజన్16లో పంజాబ్ కింగ్స్ అదరగొడుతోంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఐదింటిలో విజయం సాధించింది. చెన్నైతో జరిగిన కిందటి మ్యాచ్‌లో పంజాబ్ సంచలన విజయం సాధించింది. బలమైన చెన్నైపై 201 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని సయితం ఛేదించింది. ఈ గెలుపుతో పంజాబ్ నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఐపిఎల్ బరిలోకి దిగిన పంజాబ్ సమష్టి పోరాటంతో సంచలన విజయాలను సొంతం చేసుకుంటుంది. కెప్టెన్ శిఖర్ ధావన్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇతర జట్లతో పోల్చితే పంజాబ్ సమష్టిగా పోరాడుతూ విజయాలు అందుకుంటోంది. ప్రతి ఆటగాడు తనవంతు పాత్ర సమర్థంగా పోషిస్తున్నాడు. దీంతో లీగ్ దశలో పంజాబ్ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు పంజాబ్ ఖాతాలో ఐదు విజయాలు చేరాయి. హేమాహేమీ జట్లను సయితం పంజాబ్ అలవోకగా ఓడిస్తోంది. కోల్‌కతా, రాజస్థాన్, లక్నో, ముంబై, చెన్నై వంటి టైటిల్ ఫేవరెట్ జట్లను పంజాబ్ కంగుతినిపించింది. చెన్నైతో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించడంతో పంజాబ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.
ఒత్తిడిలోనూ పంజాబ్ బ్యాటర్లు అసాధారణ పోరాట పటిమను కనబరిచారు. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ధావన్‌లు శుభారంభం అందించగా, లివింగ్‌స్టోన్, శామ్ కరన్, జితేష్ శర్మ అద్భుత బ్యాటింగ్ కనబరిచారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా అర్ధ సెంచరీ సాధించక పోయినా పంజాబ్ 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. చివరి బంతికి మూడు పరుగులు తీసి సికందర్ రజా పంజాబ్‌కు అద్భుత విజయం అందించాడు. ఐపిఎల్‌లో పాల్గొంటున్న ఇతర టీమ్‌లలో పలువురు అగ్రశ్రేణి క్రికెటర్లు ఉన్నారు. పంజాబ్‌లో మాత్రం శిఖర్ ధావన్, శామ్ కరన్‌లు మాత్రమే స్టార్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకున్నారు. లివింగ్‌స్టోన్, సికందర్ రజాలు ఉన్నా వారిపై పెద్దగా అంచనాలు లేవు. అయితే ఈ సీజన్‌లో మాత్రం పంజాబ్ బ్యాటర్లు సమష్టిగా ముందుకు సాగుతున్నారు. ప్రతి బ్యాటర్ తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పంజాబ్ చిరస్మరణీయ విజయాలతో నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇకపై జరిగే మ్యాచుల్లో కూడా ఇలాంటి ప్రదర్శనే చేయాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే పంజాబ్ నాకౌట్‌కు చేరడం ఖాయం.
రేసులోనే ముంబై
ముంబై: ఆరంభంలో వరుస ఓటములతో సతమతమైన ముంబై ప్రస్తుతం వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో పంజాబ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 212 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించడం విశేషం. బౌల్ట్, అశ్విన్, చాహల్, సందీప్ శర్మ, హోల్డర్ వంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉన్న రాజస్థాన్‌పై ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం తేలికైన అంశమేమీ కాదు. తీవ్ర ఒత్తిడిలోనూ ముంబై బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే కామెరూన్ గ్రీన్, ఇషాన్ కిషన్‌లు ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా జట్టును లక్షం దిశగా నడిపించారు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌తో స్కోరును ముందుకు నడిపించాడు. కామెరూన్ తన అద్భుత ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. 26 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోతున్న సూర్యకుమార్ కీలక సమయంలో అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు.
ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ 29 బంతుల్లోనే 55 పరుగులు సాధించాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మరోసారి సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్‌లో అసలైన హీరో టిమ్ డేవిడ్ అనే చెప్పాలి. తీవ్ర ఒత్తిడిలోనూ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. వరుస సిక్సర్లతో రాజస్థాన్ బౌలర్లను హడలెత్తించాడు. ముఖ్యంగా జేసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది ముంబైకి సంచలన విజయం సాధించి పెట్టాడు. ఈ విజయంతో ముంబై తన ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన ముంబై ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. అయితే పంజాబ్ చేతిలో ఓటమి పాలుకావడంతో ముంబై కష్టాలు మళ్లీ మొదటి కొచ్చాయి. కానీ కీలకమైన మ్యాచ్‌లో రాజస్థాన్ వంటి బలమైన జట్టుపై విజయం సాధించడంతో ముంబై ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. రానున్న మ్యాచుల్లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడేందుకు ఈ విజయం దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.