అమరావతి: పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఎపి బిజెపి అధ్యక్షురాలు నేత పురందేశ్వరి తెలిపారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధుల దారి మళ్లింపుపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద బిజెపి నేతలు మహానిరసన కార్యక్రమం చేపట్టారు. ఒంగోలులో జరిగే నిరసన కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నిధుల లేమి వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనుగులు జరగడంలేదని, సొంత డబ్బులు పెట్టి సర్పంచులు పనులు చేశారని, బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని పురందేశ్వరి తెలియజేశారు.
Also Read: గ్రూప్-2 వాయిదాపై హైకోర్టులో పిటిషన్..
చిన్న గుత్తేదారులు కూడా ఇబ్బంది పడుతున్నారని, బిల్లులు రాక చిన్న గుత్తేదారులు కూడా రోడ్డున పడ్డారని, సర్పంచుల ఆత్మహత్యల పాపం సిఎం జగన్‌ది కాదా? అని పురందేశ్వరి ప్రశ్నించారు. ఏనాడైనా సర్పంచులపై జగన్ మాట్లాడారా? అని నిలదీశారు. గ్రామ సచివాలయాలు, ఆర్‌బికేలపైనే జగన్ మాట్లాడుతున్నారని, సర్పంచుల వ్యవస్థను అవమానపరుస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామాల్లో పనుల కోసం ఇచ్చిన నిధులు దారిమళ్లిస్తున్నారని ధ్వజమెత్తారు. సర్పంచ్ వ్యవస్థను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.