Sunday, November 24, 2024

తెరుచుకున్న రత్న భాండాగారం

- Advertisement -
- Advertisement -

ఒడిశా లోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు భాండాగారం రహస్య గదిని తెరిచినట్టు ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. రత్న బాండాగారంపై ఒడిశా ప్రభుత్వం నియమించిన కమిటీ ఛైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్, కమిటీ సభ్యుడు సీబీకే మహంతి, ఆలయ పాలనాధికారి అరవింద పాడి, పూరీ జిల్లా కలెక్టర్ సిద్దార్థ శంకర్‌స్వైన్, పురావస్తుశాఖ ఇంజినీర్ ఎన్‌సీ పాల్, పూరీ రాజప్రతినిధితోపాటు ఐదుగురు ఆలయ సేవాయత్‌లు తదితరులు మొత్తం 11 మంది మాత్రమే లోపలికి వెళ్లారు. లోపల విష సర్పాలు ఉంటాయన్న అనుమానాల నేపథ్యంలో పూరీ రత్నభాండాగారంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

భాండాగారం తెరవడానికి ముందు ఉదయం శ్రీక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుండిచా మందిరానికి వెళ్లి జగన్నాథుడి అనుమతి తీసుకున్నాక, లోకనాథ ఆలయంలో పూజలు చేశారు. అక్కడ ఆజ్ఞమాల (పూలమాల) తీసుకుని శ్రీచక్రం (ఖజానా గది) వద్దకు చేరుకున్నారు. అంతకు ముందు శ్రీ చక్రానికి రక్షగా ఉన్న విమలాదేవి, మహాలక్ష్మి సన్నిధిలో పూజలు నిర్వహించారు. ఆ తల్లుల అనుమతితో రత్న భాండాగారం తెరిచారు. గదిలో సర్పాలు ఉన్నాయనే అనుమానంతో ముందు జాగ్రత్తగా స్నేక్ హెల్ప్‌లైన్, 40 మందితో కూడిన ఓడీఆర్‌ఏఎఫ్ బృందాలను ఆలయం వెలుపల సిద్ధంగా ఉంచారు. అవసరమైతే వీరిని లోపలికి తీసుకెళ్లనున్నారు.

46 ఏళ్ల క్రితం తెరిచారు.
రత్న భాండాగారాన్ని చివరిసారిగా 46 ఏళ్ల క్రితం 1978లో తెరిచారు. సంపద ఉన్న పెట్టెలు జీర్ణావస్థలో ఉండే మార్చేందుకు వీలుగా 15 చెక్క పెట్టెలను అధికారులు సిద్ధం చేయించారు. వాటిలో ఆరింటిని ఆ గది వద్దకు ఆదివారం ఉదయం తరలించారు. శ్రీక్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మాలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళల్లో సేవాయత్‌లు చేపడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకుండా భాండాగారం తెరిచేందుకు అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు.

ఆభరణాల లెక్కింపు ప్రక్రియ డిజిటలైజేషన్
ఈసారి లెక్కింపు తరువాతే జగన్నాథుని ఆభరణాల విలువపై అంచనాకు వచ్చే అవకాశం ఉంది. రత్న భాండాగారం లోని సంపదను మరో చోటికి తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కించే వీలుంది. ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియనంతా ఒడిశా ప్రభుత్వం డిజిటలైజేషన్ చేయనుంది. ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది ? అనేది అధికారులు చెప్పలేక పోతున్నారు. భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనుందా ? అనే వివరాలపై స్పష్టత రాలేదు.

ఆభరణాలు ఐదు పెట్టెల్లో రహస్యంగా…
పూరీ జగన్నాథుని ఆభరణాలను ఐదు పెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వ మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు . చివరి సారిగా 1978 లో లెక్కించగా, 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు కూడా దీన్ని సమర్థించింది. రహస్య గదులు జీర్ణావస్థకు చేరి, వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతులు చేయాలని కోర్టులు 2018 లోనే పురావస్తుశాఖను ఆదేశించాయి. 2019 ఏప్రిల్ 6 న నాటి నవీన్ పట్నాయక్ సర్కారు నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లగా, రహస్య గది తాళపు చెవి కనిపించలేదు.

దీంతో సభ్యులు వెనుదిరిగారు. తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్ రఘువీర్‌దాస్ కమిటీని నియమించింది. ఇంతలో డూప్లికేట్ తాళపు చెవి పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం వెల్లడించలేదు. దీన్ని ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. తాము అధికారం లోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి , విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. ఆ కమిటీ రత్నభాండాగారం తెరవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు. 48 ఏళ్లుగా అందులోకి ఎవరూ వెళ్లలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News