Thursday, January 23, 2025

మరోసారి ఓపెన్ చేసిన పూరీ భాంఢాగారం రహస్య గది

- Advertisement -
- Advertisement -

పూరీ: ఒడిషా పూరీ క్షేత్రంలోని రత్న భాంఢాగారాన్ని గురువారం తిరిగి తెరిచారు. వారంలో ఈ ఖజానా గదిని తెరవడం ఇది రెండోసారి. ఇందులోని విలువైన నగలు, వజ్రాలు ఇతరత్రా వస్తువులను తాత్కాలికంగా ఏర్పాటు చేసే స్ట్రాంగ్‌రూంకు తరలించేందుకు ఇప్పుడు ఈ గదిని ఉదయం 9.51 గంటటకు తిరిగి తెరిచినట్లు అధికారులు గురువారం తెలిపారు. 12వ శతాబ్ధం నాటి పూరీ జగన్నాథుని ఆలయంలోని ఈ రత్న భాంఢాగారం ఓ అంతుచిక్కని రహస్యంగా నిలిచింది. ముందుగా సంప్రదాయం ప్రకారం జగన్నాథుడికి తోబుట్టువులకు పూజాదికాలు నిర్వహించిన తరువాత ఈ గదిని తెరిచారు.

రత్న భండార్‌లోని విలువైన వస్తువుల తరలింపునకు ఒడిషా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్యవేక్షక కమిటీ సభ్యులు ముందుగా ఆలయంలోకి చేరుకున్నారు. ఆలయంలోకి వెళ్లే ముందు కమిటీ ఛైర్మన్, ఒడిషా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ విశ్వనాథ్ రథ్ విలేకరులతో మాట్లాడారు. రత్న భండార్‌లో లోపలి గదిలోని విలువైన వస్తువులన్నింటిని సక్రమ రీతిలో తరలించేందుకు దేవదేవుడి ఆశీస్సులు తీసకున్నట్లు వివరించారు. 46 సంవత్సరాల వ్యవధి తరువాత ఈ నెల 14వ తేదీన నిధిని తెరిచారు. ఆ రోజున ఖజానాలోని వెలుపలి గదుల్లోని వస్తువులను స్ట్రాంగ్‌రూంకు తరలించడం జరిగింది.

విలువైన నగలు ఇతర వస్తువుల తరలింపు దశలో ఇక్కడ ఉండి, తరలింపును పర్యవేక్షించాలని తాము పూరి రాజవంశీకుడు గజపతి మహారాజ దివ్య సింగ్ దేవ్‌ను కోరినట్లు జస్టిస్ రథ్ తెలిపారు. ఆయన ఆదేశాల మేరకే తాత్కాలిక కోశాగారం ఏర్పాటు చేసినట్లు వివరించారు. గురువారమే అంతర్ వలయపు గది నుంచి వస్తువుల తరలింపు పూర్తవుతుందని తెలిపారు. ఆలయ నిధి తలుపులు తెరిచినందున గురువారం భక్తుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. కేవలం అధీకృత గుర్తింపు కార్డులు ఉన్నవారినే లోపలికి పంపించారు. నిధిలోపలి అరలలో కొన్ని సొరంగ మార్గాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నందున సంబంధిత విషయంలో స్పష్టత రావల్సి ఉందని స్థానిక అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News