ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప-2 ది రూల్’మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పుష్ప-2 సినిమా నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ క్రమంలో యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్‌లను అరెస్ట్ చేయరాదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తొక్కిసలాటలో ఓ మహిళ మృతి నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ రవిశంకర్, నవీన్‌లు హైకోర్టులో దాఖలు చేసి న పిటిషన్‌పై జస్టిస్ కె.సుజనా విచారణ చేపట్టి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
మొదటగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్. నవీన్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఈ ఘటనతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అభియోగాలు ఏవీ వారికి వర్తించ వన్నారు. హీరో అల్లు అర్జున్ థియేటర్‌కు వస్తున్నట్లు నిర్మాతల కార్యాలయం సిబ్బంది, థియేటర్ యాజమాన్యం పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లను అరెస్ట్ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్లను ఆదేశించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన థియేటర్ మేనేజర్ అడ్ల శరత్ చంద్రనాయుడు, అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది చెరుకు రమేష్, శ్రీరాములు రాజు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు.