హైదరాబాద్: అల్లుఅర్జున్ నటించిన పుష్ప2 మూవీ బెన్ ఫిట్ షో సందర్భంగా బుధవారం రాత్రి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసిలాట ఘటన మహిళ మృతి చెందడంపై నిర్మాణ సంస్థ స్పందించింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. కాగా, ఈ ఘటనలో మృతురాలి కొడుకు కూడా స్పృహ కోల్పోవడంతో వెంటనే సిపిఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు.
కాగా, ఈ ఘటనపై మృతురాలి భర్త మాట్లాడుతూ.. మా బాబు శ్రీ తేజ అల్లు అర్జున్ ఫ్యాన్ కావడంతో పుష్ప2 సినిమాకువ వెళ్లామని రేవతి భర్త భాస్కర్ తెలిపారు. అందరూ మా బాబుని పుష్పా అని పిలుస్తారని, పుష్ప2 సినిమాకు వచ్చి భార్యను కోల్పోవడం తట్టుకోలేక పోతున్నానని బాధను వ్యక్తం చేశాడు. తొక్కిసలాట జరగగానే మా బాబు కిందపడిపోయాడని, వెంటనే పోలీసులు స్పందించి సిపిఆర్ చేసినపుడు మా బాబు స్పృహ లోకి వచ్చాడని, వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు.
మొదట తన భార్య పిల్లలు లోపలికి వెళ్లారని, అప్పటికి అభిమానులు మాములుగానే ఉన్నారని, అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా గుంపు గుంపులుగా అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ప్రస్తుతం మా బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారన్నారు. ఇప్పటికీ ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించలేదని మృతురాలు బంధువులు వాపోతున్నారు. వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంధ్య థియేటర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.