ముంబయి: చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో వివాదాస్పద తీర్పులిచ్చిన బాంబే హైకోర్టు మహిళా న్యాయమూర్తి పుష్ప గనేడీవాలా మరో ఏడాదిపాటు అదనపు జడ్జిగా పని చేయనున్నారు. ఆమెతో శనివారం బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో సీనియర్ జడ్జి జస్టిస్ నితిన్‌జమ్దార్ ప్రమాణస్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం ఆమెను మరో రెండేళ్లపాటు అదనపు జడ్జిగా కొనసాగించడానికి సిఫారసు చేయగా, కేంద్ర న్యాయశాఖ ఒక ఏడాదికి మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో, ఆమెకు మరో ఏడాది అదనపు జడ్జిగా కొనసాగే అవకాశం లభించింది. ఈ ఏడాది జనవరి 20న సుప్రీంకోర్టు కొలీజియం పుష్పను శాశ్వత జడ్జిగా నియమించేందుకు ప్రతిపాదించింది. అయితే, జస్టిస్ పుష్ప ఇటీవల పోక్సో కేసుల్లో వివాదాస్పద తీర్పులు వెల్లడించారు. శరీర భాగాలను నేరుగా తాకితేనే పోక్సో చట్టం కింద శిక్షించాలని, దుస్తుల మీదుగా తాకితే ఆ చట్టం వర్తించదని తీర్పులిచ్చారు. ఈ తీర్పులు వివాదాస్పదమయ్యాయి. దాంతో, ఆమెను శాశ్వత జడ్జిగా నియమించే నిర్ణయాన్ని కొలీజియం వెనక్కి తీసుకున్నది.