78 ఏళ్ల బామ్మ అభిమానంతో వీలునామా
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌కు చెందిన 78 ఏళ్ల బామ్మ పుష్ప ముంజియల్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటే అమితమైన అభిమానం. ఆయన సిద్ధాంతాలు నచ్చడమే కాదు దేశానికి రాహుల్ అవసరం ఎంతగానో ఉందని ఆమె గాఢమైన విశ్వాసం కనబరుస్తున్నారు. తన పేరు మీదున్న 50 లక్షల విలువైన ఆస్తులు, 10 తులాల బంగారం రాహుల్‌కు చెందేలా వీలునామా రాశారు. సోమవారం పీసీసీ మాజీ చీఫ్ ప్రీతమ్ సింగ్ నివాసానికి వెళ్లిన ఆమె .. రాహుల్ పేరుపైన తన ఆస్తులు బదలాయిస్తున్న వీలునామాను అందజేశారు. ఈ వీలునామాను కోర్టు లోనూ సమర్పించారు. “ దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి నేటి వరకు రాహుల్ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఆయన అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఈ దేశానికి ఎంతో అవసరం. అందుకే నా మరణానంతరం నా ఆస్తులన్నీ రాహుల్‌కి చెందేలా వీలునామా రాశాను. ఇదే విషయాన్ని కోర్టుకూ చెప్పాను. ” అని పుష్ప చెప్పారు. ఆ వీలునామా పత్రాన్ని చూసి మొదట ఆశ్చర్యపోయిన కాంగ్రెస్ నేతలు, ఆ తరువాత బామ్మను అభినందించారు.