మాస్కో : ఆసియాలో రెండు శక్తివంతమైన దేశాలు రష్యా, చైనా అధినేతలు పుతిన్, జిన్‌పింగ్ వచ్చేవారం ఉజ్బెకిస్థాన్‌లో అత్యున్నతస్థాయి సమావేశంలో ముఖాముఖి చర్చలు జరపనున్నారు. ఉజ్బెక్ లోని సమర్‌ఖండ్‌లో ఈ భేటీ జరగనుంది. ఉక్రెయిన్‌తో సుదీర్ఘకాలంగా యుద్ధాన్ని కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వీరిద్దరూ భేటీ కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. సమర్ఖండ్‌లో నిర్వహించనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనేజేషన్ సదస్సుకు జిన్‌పింగ్ హాజరు కానున్నారు.
రష్యా లోని తూర్పు భాగంలో మిలిటరీ విన్యాసాలు జరుగుతున్నాయని, ఇందులో చైనా పాల్గొంటుందని రష్యా మిలిటరీ అధికార వర్గాలు ఈ వారం మొదట్లో పేర్కొన్నాయి. ఉక్రెయిన్ యుధ్ధ నేపథ్యంలో పశ్చిమ దేశాలతో రష్యాకు ఉద్రిక్తతలు ఏర్పడిన తరుణంలో చైనా, రష్యా మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకోడానికి ఈ భేటీ వేదిక కానుంది. మిలిటరీ కూటమిని ఏర్పాటు చేసుకునే అవకాశాలపై ఇదివరకు రెండు దేశాలు తిరస్కరించినప్పటికీ అటువంటి అవకాశాన్ని తోసిపుచ్చలేమని పుతిన్ చెబుతున్నారు. రష్యా అత్యంత సున్నిత, సైనిక సాంకేతికతలను అత్యంత ప్రాధాన్యంగా చైనాతో పంచుకుంటుందని , దీనివల్ల తమ రక్షణ సామర్ధం మరింత గణనీయంగా వృద్ధి చెందుతుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.