Monday, December 23, 2024

రగిలిపోతున్న పుతిన్ ఏమైనా చేస్తాడేమో

- Advertisement -
- Advertisement -

Putin Angry, frustrated, likely to escalate write: US intelligence

అమెరికా ఇంటలిజెన్స్ అప్రమత్తం
బలీయ నేతవిచిత్ర మానసిక స్థితి
సెనెటర్లకు తెలిపిన సిఐఎ చీఫ్

వాషింగ్టన్ : రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు నిరాశ నిస్పృహలతో రగిలిపోతున్నాడని, యుద్ధం మరింత తీవ్రతరం చేసేలా ఉన్నాడని అమెరికా అభిప్రాయపడింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగి, రెండు రోజులలోనే తమ టార్గెట్ పూర్తి చేసుకుంటామని పుతిన్ భావిస్తూ వచ్చాడు. అయితే రెండు వారాలు పైబడి ఈ యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్ నుంచి తీవ్రస్థాయి ప్రతిఘటన ఎదురవుతోంది. దీనితో పుతిన్ దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. ఏదైనా చేసేలా తెగింపు చర్యలకు దిగేలా ఉన్నాడని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ఈ విధమైన నైరాశ్యపు, యుద్ధ మానసిక స్థితి గల పుతిన్ తదుపరి చర్యల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి. ఉక్రెయిన్‌ను దెబ్బతీసేందుకు రష్యా నేత రాబోయే రోజులలో యుద్ధం మరింత తీవ్రతరం చేయడం పనిలో పనిగా మరింత విధ్వంసకరంగా దీనిని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాకు అన్ని విధాలుగా సైనిక ఆయుధ సంపత్తి ఉంది, దీనితో పోలిస్తే ఉక్రెయిన్ సాధనసంపత్తి తక్కువే.

అయితే ఇన్నిరోజులు తమ దాడికి ఫలితం లేకపోవడంతో పుతిన్ పరిపరివిధాలుగా ఆందోళనకు గురి అవుతున్నట్లు, ఇటువంటి స్థితిలో ఎటువంటి పరిణామాలు ఉంటాయనేదే తమకు అంతుచిక్కని విధంగా మారిందని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఓ వైపు పుతిన్‌పై అంతర్జాతీయ స్థాయిలో ఆంక్షలు విమర్శలు తీవ్రతరం అవుతున్నాయి. అంతర్గతంగా కూడా యుద్ధం పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయితే వీటన్నింటికి అతీతంగా అచేతన స్థితికి తనదైన మానసిక విచిత్ర స్థితికి పుతిన్ చేరుకుంటున్నాడని భావించాల్సి వస్తోందని సిఐఎ డైరెక్టర్ విలియమ్ బర్న్ వ్యాఖ్యానించారు. పుతిన్ ఆలోచనా ధోరణి ఏ విధంగా ఉందనేది అంచనా వేయడం కష్టమే. పాశ్చాత్య దేశాల పట్ల ఆయన ఇప్పుడు ఎటువంటి వైఖరికి దిగుతారు? ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది అంతుచిక్కని వైనంగా మారిందని తెలిపారు. నాటో నుంచే ఎక్కువగా ఉక్రెయిన్‌కు ఆర్థిక సైనిక సాయం అందుతోంది.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఇకపై పుతిన్ ఏకంగా నాటోపై దాడికి దిగుతాడా? లేక అణ్వాయుధాల బటన్ నొక్కుతాడా? అనేది ఆలోచించాల్సిన విషయమే అని అన్ని విధాలుగా ఒత్తిళ్లలో ఉన్న నేత మానసిక స్థితిని అంచనా వేయడం కష్టమే అని నిఘా వర్గాలు తెలిపాయి. దశాబ్దాలుగా పుతిన్ అనేక విధాలుగా రష్యాలో శక్తివంతమైన నేతగా మారాడు. ప్రభుత్వ వ్యవహారాలు, సైన్యంపై పూర్తి ఆధిపత్యం సాధించారు. తన చుట్టూ అతి పరిమిత కోటరి ఉంది. దీని ఆలోచనల పరిధిలోనే తన నిర్ణయాలను అమలు చేస్తూ వస్తున్నారు. అసమ్మతిని అణచివేస్తూ , ఎదురుతిరిగిన వారిని చంపించడం లేదా జైలుకు పంపించడమో చేస్తూ తన సత్తా చాటుకుంటున్నాడని ఈ విధంగా మారిన వ్యక్తి నడిపిస్తున్న యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో అనేది కీలక అంశం అని అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పుతిన్ చాలా కాలంగా ఆత్మనూన్యత ఇదే సమయంలో అధికార ఆకాంక్షల కలయికల స్థితిలో ఉన్నారని ఇది ఆయన చర్యలతో స్పష్టం అవుతోందని సిఐఎ డైరెక్టర్ ఇటీవల అమెరికా ఎంపిలకు తెలియచేశారు. ఇప్పుడు పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలను విధించాయి.

ఉక్రెయిన్‌పై పోరులో అనుకున్నఫలితం దక్కని స్థితి, మరో వైపు రష్యాలో పెరుగుతున్న జనజీవన కడగండ్లు వంటి స్థితిలో పుతిన్ ఇకపై ఏ విధంగా వ్యవహరిస్తాడు? ఇతర దేశాలపై ఇది ఏ విధమైన ప్రభావం చూపుతుంది? ప్రపంచ పరిస్థితి ఏ విధంగా మారుతుందనేది ప్రశ్నార్థకం అవుతోందని అమెరికా ఇంటలిజెన్స్ నేత తెలిపారు. బర్న్ ఇంతకు ముందు రష్యాలో అమెరికా రాయబారిగా పనిచేశారు. పలుసార్లు పుతిన్‌తో కలిసిన అనుభవం ఉంది. ఆయన అంతరంగాన్ని ఆకళింపుచేసుకున్నారు. పుతిన్ మానసిక స్థితి బాగా లేదని అనుకుంటున్నారా? అని సెనెటర్లు ప్రశ్నించగా అటువంటిదేమీ లేదని, పుతిన్ క్రేజీ అయ్యాడనే వాదనకు తాను అవునని చెప్పడం లేదని, అయితే ఇప్పుడు ఆయన కోపంతో రగిలిపోతున్నాడు. నిస్పృహతో వ్యవహరిస్తున్నాడు. ఇదే అత్యంత కీలక పరిణామం అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News