Thursday, January 23, 2025

శాంతిని కోరుకుంటున్నా.. పశ్చిమ దేశాలే రెచ్చగొడుతున్నాయి

- Advertisement -
- Advertisement -

మాస్కో: ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగానే పరిష్కరించాలనుకున్నా, పశ్చిమదేశాలు మాత్రం సమస్యను జఠిలం చేస్తూ రెచ్చగొడుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. రష్యాఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది కావడం , అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అకస్మాత్తుగా ఉక్రెయిన్‌లో పర్యటించిన నేపథ్యంలో ఫెడరల్ అసెంబ్లీని ఉద్దేశించి పుతిన్ మంగళవారం నాడు ప్రసంగించారు. ఉక్రెయిన్‌పై దాడికి వెళ్లడానికి పశ్చిమ దేశాలే కారణమని ఆయన పదేపదే ఆరోపణలు చేశారు. పశ్చిమ దేశాలు తూర్పు దిశగా దూకుడు పెంచాయని, తూర్పు దేశాలను నాశనం చేయాలన్న మోసపూరిత ఆలోచనలతో పశ్చిమ దేశాలు ఉంటున్నాయని పేర్కొన్నారు.

స్థానిక సమస్యను, పశ్చిమదేశాలు ప్రపంచ సమస్యగా మారుస్తున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్, డాన్‌బాస్ అబద్ధాలకు గుర్తులుగా మారాయన్నారు. రష్యా వస్తుందని, తమను ఆదుకుంటుందని డాన్‌బాస్ ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తోందని, డాన్‌బాస్‌పై కీవ్ కఠిన చర్యలను తిప్పి కొట్టేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు. నాటో దళాన్ని పెంచుతూ పశ్చిమ దేశాలు దురుసుగా ప్రవర్తిస్తున్నాయని, వాళ్ల దూకుడును అడ్డుకునేందుకు సైన్యాన్ని తాము రంగం లోకి దింపామన్నారు.

ఉక్రెయిన్ ప్రజలు వెస్ట్రర్న్ మాస్టర్ల చేతిలో బందీలుగా మారారని, ఉక్రెయిన్ పాలకులు దేశ ప్రయోజనాలను కాపాడలేరని, విదేశీ శక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశం కోసం పోరాడుతున్న సైనికులు, వారి కుటుంబాలకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని పుతిన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News