Wednesday, January 22, 2025

యుద్ధానికి ఆజ్యం

- Advertisement -
- Advertisement -

Putin Declares Annexation Of 4 Ukrainian Regions ఉక్రెయిన్‌లోని లుహానస్క్, డాంటెక్స్, ఖెర్సన్, జపోరిఝియాలను కలుపుకుంటూ శుక్రవారం నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న చర్య ఏడు మాసాలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ప్రేరేపించుతుందేగాని దానిని అంతం చేసి శాంతిని నెలకొల్పదు. ఇటీవల షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇది యుద్ధాల యుగం కాదని భారత ప్రధాని మోడీ హితవు చెప్పినప్పుడు, ఈ విషయంలో రష్యాతో తమకు ఏకీభావం పూర్తిగా లేదని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పష్టం చేసినప్పుడు తొందరలోనే దీనికి ముగింపు చెబుతానని పుతిన్ వారికి బదులిచ్చినట్టు వార్తలు వచ్చాయి. కాని ఈ నాలుగు ప్రాంతాలను విలీనం చేసుకోడం ద్వారా పుతిన్ ఉక్రెయిన్‌ను, దాని దన్నుదారులైన పాశ్చాత్య కూటమి దేశాల (అమెరికా, బ్రిటన్, యూరపు)ను యుద్ధ తీవ్రత వైపు రెచ్చగొట్టారని చెప్పక తప్పదు. తూర్పు ఉక్రెయిన్‌లోని డాంటెక్స్, లుహానస్క్ ప్రాంతా లు 2014లోనే రష్యా దన్నుతో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొన్నాయి.

ఉక్రెయిన్‌లో అంతర్భాగంగా వుండిన క్రిమియాను రష్యా ఆక్రమించుకొన్న కొద్ది వారాల్లోనే ఇది జరిగింది. ఖెర్సన్, జపోరిఝియాలు గత ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడి ప్రారంభమైన వెంటనే వాటి వశమయ్యాయి. ఈ నాలుగింటినీ ఇప్పుడు రష్యా విలీనం చేసుకున్నది. ఈ ప్రాంతాలను కలుపుకోడానికి ముందు వాటిని కాపాడుకోడానికి అవసరమైతే అణ్వాయుధ ప్రయోగానికి సైతం వెనుకాడబోనని పుతిన్ హెచ్చరించాడు. యుద్ధంలో ఇప్పటికే అలసిపోయినట్టు కనిపిస్తున్న తన సేనల పరిస్థితిని గమనించిన పుతిన్ ఇప్పటికి ఈ సమరానికి తెర దించే ఉద్దేశంతోనే ఆ హెచ్చరిక చేశారనిపిస్తున్నది. అమెరికా, నాటోలు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనకపోడం వెనుక అణు యుద్ధ భయమే దాగి వున్నదని పుతిన్ భావిస్తూ వుండవచ్చు. అందుకే ఆ పాచికను ప్రయోగించాడనిపిస్తున్నది.

అయితే ఆయన ఆశిస్తున్నట్టుగా ఉక్రెయిన్, అమెరికా వెనుకకు తగ్గే సూచనలు కనిపించడం లేదు. పుతిన్ గతంలో క్రిమియా విషయంలో చేసినట్టే ఈ నాలుగు ప్రాంతాల్లోనూ అభిప్రాయ సేకరణ జరిపించాడు. అందులో దాదాపు అక్కడి ప్రజలంతా విలీనానికి అనుకూలంగా ఓటు వేసినట్టు ప్రకటించుకున్నాడు. ఆయన ఈ విలీనాన్ని ప్రకటించిన వెంటనే అమెరికా రష్యాపై ఆంక్షలను మరింత తీవ్రం చేసింది. ఉక్రెయిన్ సార్వభౌమాధికారంలో గల భాగాలను కలుపుకోడానికి రష్యా చేసిన మోసపూరిత ప్రయత్నాన్ని తాము ఖండిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రష్యా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని, ఐక్యరాజ్య సమితి నియమావళికి విద్రోహం తలపెట్టిందని, జాతులు శాంతియుతంగా మనుగడ సాగించాలనే ఉత్తమ ఆశయం పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నదని బైడెన్ అన్నారు. అదనంగా 57 రష్యన్ కంపెనీలను, 900 మందికి పైగా రష్యన్లను ఆంక్షల పరిధిలోకి తెచ్చినట్టు అమెరికా ప్రకటించింది. వీరిలో చాలా మంది రష్యన్ పార్లమెంటు సభ్యులు, అధికారులు, రష్యన్ సైన్యానికి సరఫరాలు చేస్తున్న పరిశ్రమల యజమానులు వున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ విలీన ఘట్టం పట్ల సహజంగానే తీవ్రంగా స్పందించారు.

నాటోలో సభ్యత్వం కోసం మళ్లీ మరింత దృఢ స్వరంతో విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. నాటో ఇప్పటికే తన విస్తరణ కార్యక్రమాన్ని షురూ చేసింది. ఫిన్‌లాండ్, స్వీడన్‌లను కలుపుకొనే ప్రక్రియను ప్రారంభించింది. ఉక్రెయిన్ అధికారికంగా అందులో కలవకపోయినా నాటో దేశంగానే వ్యవహరిస్తున్నది. అసలు ఈ యుద్ధానికి మూలమంతా నాటో దుర్‌వ్యూహంలోనే వుంది. నాటోను రద్దు చేసి వుండవలసిన అమెరికా రష్యా ముంగిట్లో మోహరింప చేసి నిరంతరం దానిని భయపెడుతున్నది. నాటోను ఉక్రెయిన్‌లో తిష్ఠ వేయించి తలచుకున్నప్పుడు రష్యాపై దాడి చేయించడానికి అనువుగా వుంచాలని అమెరికా కోరుకుంటున్నది. ఉక్రెయిన్‌పై సైనిక దాడిని చేపట్టడానికి కారణం ఇదేనని పుతిన్ చెప్పుకున్నాడు. ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందిస్తూ అమెరికా పరోక్షంగా యుద్ధ విస్తరణకు తోడ్పడుతున్నది. ఈ యుద్ధంలో కోల్పోయిన భాగాలను తిరిగి స్వాధీనపరచుకునే వరకు ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగిస్తామని దాని సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తామని జో బైడెన్ తాజాగా ప్రకటించారు. దానికి అదనపు ఆయుధ తోడ్పాటు కింద ఈ వారంలోనే 1.1 బిలియన్ డాలర్ల సాయాన్ని కూడా అమెరికా ప్రకటించింది. అందుచేత నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలను రష్యాలో కలుపుకొంటూ పుతిన్ తీసుకున్న చర్య యుద్ధాన్ని ఆపడానికి ఎంత మాత్రం దోహదం చేసేలా లేదు. అమెరికా విజ్ఞతను ప్రదర్శించి ఉక్రెయిన్‌ను శాంతి చర్చలకు సిద్ధం చేయడం ప్రపంచ సుఖ శాంతులకు అత్యంత ఆవశ్యకం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News