మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా మోడీ అద్భుతాలు సృష్టించి అనుకున్నది సాధించారని, ఆ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారాయన. ‘మా మిత్ర దేశం భారత్, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు గొప్ప మిత్రుడు. కొన్నేళ్ల కిందట ఆయన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌ను తీసుకువచ్చారు. సమర్థవంతంతగా దానిని దేశంలో అమలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది’ అని మాస్కోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పుతిన్ అన్నారు.
దేశీయ ఉత్పత్తుల ప్రోత్సాహంతో లాంటి అభివృద్ధిని సాధించవచ్చో ప్రధాని మోడీ భారత్‌లో చేసి చూపించారని, రష్యా దానిని ఆదర్శంగా తీసుకోవాలని పుతిన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. మనం కాకున్నా మన స్నేహితుడు చేసిందైనా సత్ఫలితాలిస్తుంటే అనుకరించడంలో తప్పేమీ లేదని పుతిన్ అన్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. రష్యాలో కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు నాయకుడు యెవెగ్నీ ప్రిగోజిన్ నేతృత్వంలో తిరుగుబాటు అనంతరం పుతిన్ ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.