Saturday, November 23, 2024

నావల్నీని విడిచిపెట్టాలనుకున్నాం… ప్రత్యర్థి మృతిపై పుతిన్ తొలి స్పందన

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారి తన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మృతిపై స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలనుకున్నట్టు తెలిపారు. అంతలోనే ఆయన మరణించారన్నారు. తాజా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు తరువాత ప్రసంగిస్తూ సోమవారం పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లలో ఆయన నావల్నీ పేరెత్తడం ఇదే తొలిసారి.

“ఖైదీల మార్పిడి కింద నావల్నీని అప్పగించి పాశ్చాత్య దేశాల జైళ్లలో ఉన్న కొంతమంది వ్యక్తులను రష్యాకు తీసుకొద్దామనే ఆలోచనను సహచరులు నా ముందుంచారు. మీరు నమ్ముతారో లేదో … ఆ వ్యక్తి తన మాటల్ని ముగించక ముందే నా అంగీకారాన్ని తెలియజేశాను. అయితే నావల్నీ తిరిగి రష్యాకు రావొద్దనే షరతు విధించాను. కానీ అంతలోనే ఇలా జరిగింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇది జీవితం” అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా నుంచి విడుదల చేయాలనుకుంటున్నట్టు ఆయన సహచరులు సైతం గత నెలలో తెలిపారు.

ఈమేరకు జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని, ఆయన మరణానికి కొన్ని రోజుల ముందు వెల్లడించారు. అయితే పుతిన్‌కు ఇది ఇష్టం లేదని, అందుకే ఈ కుట్రకు తెరతీశారని నావల్నీ మృతి తర్వాత ఆయన మద్దతుదారులు ఆరోపించారు. జర్మనీలో జైలు జీవితం గడుపుతున్న వాడిమ్ క్రాసికోవ్ కోసం రష్యా తమ దేశ కారాగారాల్లో ఉన్న నావల్నీ సహా మరో ఇద్దరు అమెరికా పౌరులను విడుదల చేయాలనుకున్నట్టు నావల్నీకి రాజకీయ సహచరి అయిన మరియా పెవ్చిఖ్ వెల్లడించారు. 2019లో బెర్లిన్‌లో జెలిమ్‌ఖాన్ ఖంగోష్విలి హత్యలో దోషిగా తేలిన క్రాసికోవ్ ప్రస్తుతం జర్మనీ జైల్లో ఉన్నాడు. రష్యా ఆదేశాల మేరకు క్రాసికోవ్ ఈ నేరానికి పాల్పడ్డాడని కోర్టు తీర్పు వెలువరించింది. అతని కోసమే నావల్నీతోపాటు దేశద్రోహం కింద అరెస్టయిన ఇద్దరు అమెరికా పౌరులను రష్యా విడిచి పెట్టాలనుకుంటుందని పెవ్చిఖ్ తెలిపారు.

అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే
రష్యా, అమెరికా నేతృత్వం లోని నాటో కూటమి మధ్య ఘర్షణ తలెత్తితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని పుతిన్ అన్నారు. అయితే దీన్ని ఎవరూ కోరుకోవడం లేదని తెలిపారు. నాటో దళాలు ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఉన్నాయని చెప్పారు. ఇది ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News