కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను పదవి నుంచి తప్పించేందుకు యత్నాలు జరుగుతున్నాయని ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కైరైలో బుదనోవ్ తెలిపారు. రష్యా అధికారులు ఈ దిశగా చురుగ్గా పనిచేస్తున్నారని బదనోవ్ చెప్పినట్టు ది మిర్రర్ పత్రిక పేర్కొంది. ఖెర్సాన్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు ఉక్రెయిన్ ఎదురుదాడిని తీవ్రతరం చేసిన సమయంలో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. “పుతిన్ కొనసాగడం కష్టమే. పుతిన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై చురుగ్గా చర్చలు జరుగుతున్నాయి” అని బుదనోవ్ పేర్కొన్నారు. నవంబర్ చివరినాటికి ఖెర్సాన్‌ను స్వాధీనం చేసుకోవాలనే లక్షంతో తమ సైన్యం సాగుతోందని బుదనోవ్ పేర్కొన్నారు. శనివారం ఉక్రెయిన్ తన డ్రోన్ శక్తిని చూపించింది. ఏకంగా క్రిమియా లోని కీలకమైన సెవస్తపోల్ సైనిక నౌకాస్థావరంపై 16 డ్రోన్లతో విరుచుకుపడింది. సెవస్తపోల్.. నల్లసముద్రంలో రష్యా నౌకాదళానికి ప్రధాన కేంద్రం దాడిపై ఉక్రెయిన్ అధికారికంగా స్పందించలేదు. ఆ దేశ సైనిక వర్గాలు మాత్రం మూడు రష్యా యుద్ధ నౌకలు ధ్వంసమైనట్టు పేర్కొన్నాయి. దాడిని ఉగ్రవాద చర్యగా మాస్కో అభివర్ణించింది. దీని వెనుక ఉక్రెయిన్ దళాలతో పాటు, బ్రిటన్ నౌకాదళానికి చెందిన ప్రత్యేక బృందం హస్తం ఉందని ఆరోపించింది.
Putin to removed by end of war: Ukraine defence chief