పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపణ
పోలాండ్ అధ్యక్షుడితో భేటీ
ఉక్రెయిన్ మంత్రులతోనూ మంతనాలు
మరో రష్యా జనరల్ మృతి
వార్సా: రష్యా సైనిక చర్య విషయంలో నాటో తూర్పు భాగాన్ని పశ్చిమంనుంచి వేరు చేసేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యత్నించాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. కానీ ఇందులో విఫలమయినందుకు పుతిన్ ఆశ్చర్యపోయి ఉంటారని శావిస్తున్నాని ఆయన అన్నారు. పోలాండ్‌లో పర్యటిస్తున్న బైడెన్‌రాజధాని వారాస పర్యటనలో భాగంగా శనివారం బైడెన్ మాట్లాడారు. నాటో సభ్య దేశాలన్నీ సమైక్యంగా ఉన్నాయన్నారు. ఐరోపాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం అమెరికాకు ముఖ్యమన్నారు.
పోలాండ్ అధ్యక్షుడితో భేటీ
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ యూరప్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాను కలిశారు. తదనంతరం ఉక్రెయిన్‌కు ఆయుధ సామగ్రి చేరవేత, ఇతర భద్రతా హామీలపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు అంతకు ముందు వైట్‌హౌస్ తెలిపింది. ఇటీవల రష్యా ..పోలాండ్ సరిహద్దుకు సమీపంలోని ఉక్రెయిన్ మిలిటరీ కేంద్రంపై దాడి చేసిన విషయం తెలిసిందే. మరో వైపు ఉక్రెయిన్‌నుంచి పెద్ద ఎత్తున శరణార్థులు పోలాండ్‌కు చేరుకుంటున్నారు. ఈ పరిణామాల మధ్య దుడోతో బైడెన్ భేటీ ప్రాదాన్యత సంతరించుకుంది.
ఉక్రెయిన్ మంత్రులతోనూ సమావేశం
మరో వైపు బైడెన్ పోలాండ్‌లో శనివారం ఉక్రెయిన్ విదేశాంగ, రక్షణ మంత్రులు దిమిత్రో కులేబా, ఓలెక్సీ రెజ్నికోవ్‌తో భేటీ అయ్యారు. రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ ఉన్నతాధికారులతో బైడెన్ ముఖాముఖి భేటీ కావడం ఇదే మొదటి సారి. ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, ఇతర ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
మరో రష్యన్ జనరల్ హతం
ఉక్రెయిన్‌పై సైనిక చర్య సందర్భంగా రష్యాకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. తాజాగా ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ సమీపంలో జరిపిన దాడిలో రష్యాకు చెందిన మరో జనరల్ .. లెఫ్టెనెంట్ జనరల్ యాకోవ్ రెజాన్‌త్సెవ్ మృతి చెందినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ శనివారం తెలిపింది. రెజాన్‌త్సెవ్ రష్యా 49వ కంబైండ్ ఆర్మీకి కమాండర్‌గా వ్యవహరించారు. రెజాన్‌త్సెవ్ ఉక్రెయిన్‌లో మరణించిన ఏడో జనరల్, రెండో లెఫ్టెనెంట్ జనరల్ స్థాయి అధికారి అని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా కమాండ్ పోస్టుగా ఉపయోగిస్తున్న చెర్నోబైవ్కా విమానస్థావరంలో ఉక్రెయిన్ దాడిలో ఆయన మృతి చెందినట్లు తెలిపారు.
కీవ్‌లో కర్ఫూ రద్దు
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఇంతకు ముందు ప్రకటించిన కర్ఫూను రద్దు చేస్తున్నట్లు నగర మేయర్ విటాలీ క్లిట్‌ష్కో తాజాగా ప్రకటించారు. కీవ్‌లో శనివారం సాయంత్రంనుంచి సోమవారం ఉదయం వరకు కర్ఫూ విధిస్తున్నట్లు అంతకు ముందు ప్రకటించారు. అయితే మిలిటరీ కమాండ్‌నుంచి తాజాగా అందిన ఆదేశాల మేరకు ఈ కర్ఫూను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే నగరంలో రాత్రిపూట కర్ఫూ యథాతథంగా అమలులో ఉంటుందని ఆయన తెలిపారు.
కార్మికుల పట్టణం రష్యా చేతిలోకి
వినియోగంలో లేని చెర్నోబిల్ నూక్లియర్ ప్లాంట్ కార్మికులు నివసిస్తున్న స్లావుటిచ్ పట్టణాన్ని రష్యా దళాలు తమ నియంత్రణలోకి తీసుకున్నాయని కీవ్ రీజియన్ గవర్నర్ ఒలెక్సాండర్ పావ్లియుక్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఆస్పత్రిని ఆక్రమించాయని, మేయర్‌నూ కిడ్నాప్ చేశాయని ఆరోపించారు. అయితే ఈ నగరంపై రష్యా సేనలు చేసిన మొదటి దాడిని ఉక్రెయిన్ సైన్యాలు తిప్పికొట్టాయని శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్ చెప్పిన విషయం తెలిసిందే.
కొనసాగుతున్న క్షిపణి దాడులు
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం కొనసాగిస్తూనే ఉంది. తాజాగా వాయువ్య ఉక్రెయిన్‌నగరం జైతోమిర్ సమీపంలోని ఆయుధాలు, రక్షణ పరికరాలతో కూడిన డిపోను తమ క్షిపణులు ధ్వంసం చేశాయని రష్యా రక్షణ శాఖ తాజాగా తెలిపింది. నల్ల సముద్రంలోని నౌకనుంచి ప్రయోగించిన నాలుగు కాలిబర్ క్షిపణులు కీవ్‌కు పశ్చిమాన 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ డిపోను ధ్వంసం చేశాయని రక్షణ శాఖ ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ వెల్లడించారు. గత 24 గంటల్లో ఉక్రెయిన్‌కు చెందిన మొత్తం 117సైనిక లక్షాలను ధ్వంసం చేశామని, ఇందులో ఆరు కమాండ్ పోస్టులు, నాలుగు విమానాలు ఉన్నాయని తెలిపారు.