Monday, March 31, 2025

మానవత్వంపై పుతిన్ యుద్ధం!

- Advertisement -
- Advertisement -

దేశాధ్యక్షులైనా, దేశ ప్రధానులైనా ఇంగిత జ్ఞానం, విచక్షణ, హేతుబద్ధత లేకపోతే జనం ‘మూర్ఖులు’ అని ముద్ర వేస్తారు. దేశంలోని అంతర్గత సమస్యలైనా, సరిహద్దు సమస్యలైనా, విదేశాంగ విధానాలైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒప్పందా లుండాలి. అప్పుడే మానవ సమాజం వికసిస్తుంది. ప్రజలు, ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలపడతాయి. అంతేగాని, యుద్ధం వినాశనానికి తప్ప దేనికీ ప్రత్యామ్నాయం కాదు. మానవ వినాశనం కోరుకునే పిరికి నియంతలు మాత్రమే తమ డెప్యూటీలను కూడా అనుమానిస్తారు. పది అడుగుల దూరం నుంచి మాట్లాడుతారు.

‘యుద్ధం అంటే ఏమిటో నాకు తెలుసు. మనుషులు చనిపోవడం చూశాను. పిచ్చెత్తి పోవడం, ఆసుపత్రిలో నరకం అనుభవించడం చూశాను. కానీ, వీటన్నిటి కన్నా ఘోరాతి ఘోరమైన విషయం మరొకటి ఉంది. యుద్ధం అంటే వికృతమైన సామూహిక మానసిక వైకల్యం. నిజాలు చెప్పేవారిని నిలువునా శిలువ వేయడం, కళాకారుల చేతులు నరికి వేయడం, సంస్కరణలను, విప్లవాలనూ, సామాజిక శక్తులను పక్కదోవ పట్టించడం అని అన్నాడు కవి, విప్లవ రచయిత, జర్నలిస్టు జాన్ రీడ్ (1887 1920). ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశానికి ఆ దేశం స్వతంత్రంగా మనగలుగుతున్నాయి. సమస్యలేమైనా ఉంటే ఒకటికి రెండు సార్లు చర్చలు జరుపుకుని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.

మరి ఇలాంటి సమయంలో పుతిన్ చేపట్టిన ఈ యుద్ధ నేరానికి కారణమేమిటి? ఇది ఉక్రెయిన్‌తో ఆగిపోతుందా? లేక ఇతర దేశాలతో కొనసాగబోతోందా? రష్యా అధ్యక్షుడు పుతిన్ చెపుతున్న దేమిటి? “ఉక్రెయిన్ వేరే దేశం కాదు. అది మా రష్యాలోని అంతర్భాగం. మేమంతా ఒక్కటే” అని చెపుతున్నప్పుడు ఆ దేశంపై అక్రమంగా యుద్ధం ప్రకటించి నగరాల్ని నాశనం చేసి, పౌరుల్ని నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టి ఆ భూభాగాన్ని తమ దేశంలో కలుపుకోవాలన్న రాజ్యకాంక్ష, దురహంకారం అతనిలో ఎందుకు పెరిగినట్టూ? అంతర్జాతీయ కోర్టు యుద్ధం తక్షణం ఆపేయమ’ని ఆదేశాలు ఇచ్చినా… పుతిన్ ఎందుకు పట్టించుకోవడం లేదూ? ఇది కమ్యూనిజానికీ, మరో ఆలోచనా ధోరణికి మధ్య జరిగే యుద్ధం కాదు. పుతిన్ తనకు తాను బలవంతుడినని ఊహించుకుని చేస్తున్న ఉగ్రవాద యుద్ధం. ఇది మానవత్వంపై యుద్ధం. మానవ వినాశనానికి దారి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ గొప్ప నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాడేమీ కాదు. అతి సాధారణ పేద కుటుంబం నుండి వచ్చాడు. తల్లి వీధులు ఊడ్చేది. ఫ్యాక్టరీ వర్కర్.

తాత లెనిన్ స్టాలిన్‌ల దగ్గర వంట మనిషిగా పని చేసేవాడు. ఈ విషయాలు గుర్తు చేసుకోవడమెందుకంటే సామాన్యుల జీవితాల్లోని సాధకబాధకాలు అతనికి తెలిసి ఉండాలి కదా? మంచితనం, మన్ననా తెలిసి ఉండాలి కదా? రష్యా అధ్యక్షుణ్ణయ్యానన్న దురహంకారంతో మానవత్వం మరవడమంటే అతనిలో మనిషి ఏమైపోయినట్టూ? ఏ రకంగా చూసినా యుద్ధం వాంఛనీయం కాదు గదా? యుద్ధం ప్రభావం ఉక్రెయిన్ ప్రజలపై నేరుగా పడితే, ఇతర ప్రపంచ పౌరులపై ముఖ్యంగా సామాన్యులపై అతి తీవ్రంగా ఉంటుంది కదా? ఇక్కడ మనం కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకప్పటి యుఎస్‌ఎస్‌ఆర్ వేరు. ఇప్పటి రష్యా యుఎస్‌ఎస్‌ఆర్ లాగా బలమైన దేశం కాదు. ఒకప్పటి సిద్ధాంతాలు, ఆలోచనా ధోరణులు ఇప్పుడున్నాయా? అన్ని దేశాలూ పెట్టుబడిదారీ వ్యవస్థలకు దాసోహమన్నాయి. ఇంకా ఆ విలువలు, ఆ నిజాయితీ, ఆ నిబద్ధతా ఎక్కడా? ఏదీఏమైనా, వైజ్ఞానిక యుగంలో బతుకుతున్న మనుషులుగా మనం ఆలోచించాలి! నిర్దాక్షిణ్యంగా బాంబు దాడులు చేసి కాలుష్యాలు పెంచుకోవడం వల్ల అణ్వస్త్రాలు ప్రయోగించి ప్రపంచాన్ని ధ్వంసం చేసుకోవడం వల్ల మనిషి ఏం సాధిస్తాడూ? లోగడ ఎన్నో జంతు వృక్ష జాతులు కాలగర్భంలో కలిసిపోయినట్టు మనిషి కూడా సత్వరం అంతరించిపోతాడు. దాని కోసమేనా ఈ తహతహ? సహజంగా వచ్చే విపత్తుల వల్ల నశిస్తే, అదే వేరే విషయం మనిషే తెలిసి తెలిసి తనను తాను నాశనం చేసుకోవడం ఏమైనా విజ్ఞత అనిపించుకుంటుందా?

ప్రపంచంలో శాంతి స్థాపించబడాలంటే ఎంతో మంది వివేకవంతులు, మేధావులూ అవసరమవుతారు. నాశనం చేయదల్చుకుంటే మానవత్వం, మానవ జాతి పరిరక్షణ.. లాంటి విషయాలపై అవగాహన లేని, విచక్షణ లేని పుతిన్ లాంటి అహంకారి ఒక్కడు చాలు! వివేకానికి హద్దులుంటాయేమో కాని మూర్ఖత్వానికి ఉండవు. మామూలుగా ప్రపంచంలోని ఏ దేశమైనా రక్షణ శాఖ మీద అతి తక్కువ శాతం ఖర్చు చేస్తుంది. ఇలా యుద్ధాలు వస్తే ఏం చేస్తాయి? విద్య, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి వంటి పనులకు ఉపయోగించే నిధులన్నీ మళ్లించి రక్షణ శాఖకు ఎక్కువ నిధులు కేటాయించుకుంటాయి.

దాని వల్ల ప్రపంచ పౌరుల వినాశనం జరుగుతుందే తప్ప, మానవాళికి జరిగే మేలు ఏమీ ఉండదు. మనకు తెలుసు. భయస్థుడే ఎక్కువ ఉలికి పడుతాడు. ఇప్పుడు పుతిన్ ముందస్తుగా ఉలికి పడి బయటపడ్డాడు. అన అమానవీయ సంకల్పంతో ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబడ్డాడు. ఉక్రెయిన్ నాటోలో చేరుతుందేమోననీ, చేరితే అమెరికా సైన్యాలు పక్కనే ఉన్న ఉక్రెయిన్‌లో మోహరించి రష్యాపై దాడి చేస్తాయేమోనని.. తన దేశ అంతర్గత భద్రత కోసం తను ఈ యుద్ధం చేస్తున్నానని పుతిన్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఈ యుద్ధం ఎటు మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాలన్నీ జాగ్రత్తగా గమనిస్తున్నాయి. రష్యా గనుక ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటే బలమైన దేశం బలహీనమైన చిన్న దేశాల్ని అక్రమంగా దెబ్బతీసి, తనలో కలుపుకోవచ్చన్నది రుజువవుతుంది. దీన్ని అనుసరిద్దామని మరి కొన్ని దేశాలు పథకాలు వేసుకుంటున్నాయేమో! అనాగరిక యుగం నుంచి అత్యాధునిక నాగరిక యుగంలోకి వచ్చి మళ్లీ అనాగరికంలో ధబీలుమని పడిపోతామన్న మాట! ఆటవిక న్యాయమే చట్టమవుతుందన్న మాట! హక్కులు, చట్టాలు మూసిపెట్టుకుని, ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం, స్వేచ్ఛ లాంటి పదాల్ని నిఘంటువుల నుండి తొలగించుకోవాలన్న మాట!
అటు రష్యాలో వేల వేల మంది రష్యన్ యుద్ధం వద్దని ఆపేయాలని మాస్కో వీధుల్లో నిరసన ప్రదర్శనలిస్తున్నారు.

బలవంతంగా పుతిన్ ప్రభుత్వం ఎంత మంది గొంతు నొక్కేయగలదూ? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సైనికులలో సైనికుడిలా, పౌరులలో పౌరుడిగా తిరుగుతూ, అటు సైన్యాన్నీ, ఇటు ప్రజలను ఉత్సాహపరుస్తున్నాడు. విదేశాల్లో స్థిరపడ్డ ఉక్రేనియన్ యువకులంతా స్వచ్ఛందంగా స్వదేశ రక్షణ కోసం వచ్చి ఆయుధాలు పట్టుకున్నారు. రాజకీయ నాయకులతో సహా స్త్రీలు, పురుషులు అందరూ ఆయుధాలు పట్టారు. చైతన్యవంతుల దేశం అది. అణ్వస్త్రాలు గల బలమైన దేశం. అయినా కూడా, ప్రపంచ శాంతి కోసం ఉక్రెయిన్ వాటిని వదిలేసింది. ఇంతకు మించిన మానవవాదం మరొకటి ఉంటుందా? అలాంటి దేశంపై యుద్ధం ప్రకటించడమంటే, అది మానవత్వంపై ప్రకటించిన యుద్ధంగానే భావించాలి! ఆ ఆత్మస్ధైర్యం, ఆ నిజాయితీ, ఆ నిబద్ధత దేశాలకైనా, వ్యక్తులకైనా తప్పనిసరి కదా? తమ సైన్యాలు దాడి చేయగానే ఉక్రెయిన్ అధ్యక్షుడు భయంతో ఇతర దేశాలకు పారిపోయి తలదాచుకుంటాడనీ, తమ సైనిక బలగాల మీద ఉక్రెయిన్ పౌరులు పూల వర్షం కురిపించి స్వాగతం పలుకుతారని బహుశా పుతిన్ కలలుగని ఉంటాడు. ఇంత తీవ్రంగా ప్రతిఘటిస్తారని ఊహించి ఉండడు.

ప్రపంచ దేశాలు ఏకమై అతణ్ణి ఏకాకిని చేస్తాయని కూడా ఊహించి ఉండడు. జెలెన్‌స్కీ హీరోగా నిలబెట్టడానికే పుతిన్ ఈ యుద్ధం చేస్తున్నట్లుంది. ఒకప్పటి రీల్ హీరో ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు. ఆయుధాలు లేకుండా పౌరులు గుంపులుగా వెళ్లి, ప్రాణాలకు తెగించి రష్యన్ టాంక్‌లను ఆపడం అంటే మాటలు కాదు. ‘రండి భోజనం చేసి వెనక్కి వెళ్లిపొండని’ ఉక్రేనియన్ పౌరులు హితవు పలికారు. అలా చెప్పడానికి ఎంతటి ఔదార్యం, ఎంతటి మానవత్వం కావాలి? అందుకు భిన్నంగా రష్యన్ బలగాలు చేసిందేమిటీ? మిలిటరీ కేంప్‌లకు పరిమితమై పోకుండా, సామాన్య పౌరులుండే అపార్టుమెంట్‌ల మీద, ఆసుపత్రుల మీద, విద్యాలయాల మీద బాంబులు కురిపించాయి. అదేం యుద్ధనీతి?
దేశాధ్యక్షులైనా, దేశ ప్రధానులైనా ఇంగిత జ్ఞానం, విచక్షణ, హేతుబద్ధత లేకపోతే జనం ‘మూర్ఖులు’ అని ముద్ర వేస్తారు. దేశంలోని అంతర్గత సమస్యలైనా, సరిహద్దు సమస్యలైనా, విదేశాంగ విధానాలైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒప్పందాలుండాలి. అప్పుడే మానవ సమాజం వికసిస్తుంది. ప్రజలు, ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలపడతాయి.

అంతేగాని, యుద్ధం వినాశనానికి తప్ప దేనికీ ప్రత్యామ్నాయం కాదు. మానవ వినాశనం కోరుకునే పిరికి నియంతలు మాత్రమే తమ డెప్యూటీలను కూడా అనుమానిస్తారు. పది అడుగుల దూరం నుంచి మాట్లాడుతారు. మానవ శ్రేయస్సు కోసం పాటుపడే వారు నిరంతరం ప్రజలలోనే ఉంటారు. యుద్ధం వద్దని మాస్కో వీధుల్లో నిరసన ప్రదర్శనలిస్తున్న రష్యా పౌరులే తమ ప్లకార్డుల మీద పుతిన్ పేరు ఇలా రాశారు. “పుట్ ఇన్‌” అని! వారేం కోరుకుంటున్నారో అందులో ఉంది. ప్రపంచ మానవవాదులంతా ఆకాంక్షించేది కూడా అదే! ‘మనిషి’ని బతికించుకోవడమే మానవాళి ధ్యేయం కావాలి! పిరికివాడు డిక్టేటర్ కావచ్చు. మనిషి కావాలంటేనే సాహసవంతుడై ఉండాలి!

డాక్టర్ దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News