వార్సా (మాస్కో): గతకొంతకాలంగా అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బాహాటంగా బెదిరిస్తూ ప్రచారం సాగిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు పశ్చిమదేశాలను మళ్లీ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై తమ దాడిని అడ్డుకోడానికి ఎవరైనా సైనిక బలగాలను పంపించితే అణ్వాయుధాలతో ప్రతిఘటిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిన తరువాత తమ సామర్థాలను కొంతవరకు కోల్పోయినప్పటికీ ఇప్పుడు రష్యా అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ దేశంగా నిలదొక్కుకుందని ఉక్రెయిన్‌పై దాడికి ముందు గురువారం పుతిన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇలాంటి సంఘర్షణ సందర్భాల్లో అలాంటి అణ్వాయుధాలతో కచ్చితమైన ప్రయోజనం ఉంటుందని, అందువల్ల ఎవరైనా నేరుగా తమ దేశంపై బలంగా దూకుడు ప్రదర్శిస్తే ఓటమితోపాటు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని పుతిన్ స్పష్టం చేశారు.
అణ్వాయుధాల ప్రయోగం కేవలం ప్రతిపాదనకే పరిమితం కాకుండా ఉక్రెయిన్‌పై ప్రస్తుత దాడిలో ప్రయోగించే అవకాశం కనిపిస్తోంది. అది రష్యాకు, అమెరికాకు మధ్య అణ్వాయుధ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి అనుభవం కోల్డ్ వార్ సమయంలో పెరిగే వారికి తెలిసిందే. అణుసైరెన్లు మోగేటప్పుడు అమెరికా స్కూలు పిల్లలను తమ డెస్కుల కింద దాక్కోమని హెచ్చరించడం ఆనాటి అనుభవం. బెర్లిన్ గోడను కూల్చినప్పుడు, సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం అయినప్పుడు, రెండు అగ్రరాజ్యాధికారాలు అణ్వాయుధ నిరాకరణ, ప్రజాస్వామ్యం, పురోగతి కోసం నిలిచినప్పుడు ప్రజల్లోంచి వెనుకటి భయాలు క్రమంగా పటాపంచలయ్యాయి.
అంతకు ముందు యువత కూడా రెండు దేశాలు పరస్పరం అణ్వాయుధాలతో దాడులకు దిగితే చివరకు అటుఇటు వినాశనమే తప్ప ఇంకేమీ ఉండదని తెలుసుకున్నారు. జపాన్‌పై అణుబాంబు దాడి జరిగిన తరువాత 1945 నుంచి ఏ దేశం అణ్వాయుధాలను వినియోగించే సంఘటనలు జరగలేదు. అణుబాంబు దాడే సరైన మార్గమని ఆనాడు అనుకోవడం తోనే హీరోషిమా, నాగసాకి బాంబు దాడులకు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. గత చారిత్రక అనుభవాలన్నీ తెలిసే పుతిన్ పశ్చిమదేశాలు తటస్థంగా ఉండేలా అణ్వాయుధ ప్రయోగం బూచీని మళ్లీ ముందుకు తోస్తున్నారు. అంతేకాక అత్యంత శక్తివంతమైన దేశంగా రష్యాను ప్రపంచానికి చాటడం కోసం ఆయన ఈ ఎత్తుగడ పన్నినట్టు తెలుస్తోంది.