మాస్కో : వాగ్నర్ కిరాయి సైన్యం అధిపతి ప్రిగోజిన్ విషాదాంతం తరువాత రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారి స్పందించారు. ప్రిగోజిన్ చనిపోయినట్లు తమకు ప్రాధమికంగా నిర్థారణ అయిందని పుతిన్ చెప్పారు. ఇక నేత అంకం ముగిసిందని, వాగ్నర్ సైనికులు అంతా చెల్లాచెదరు కాకుండా తమకు విధేయత చూపే పత్రాలపై సంతకాలు చేయాలని పుతిన్ పిలుపు నిచ్చారు.
యెవెగెని ప్రిగోజిన్ చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్న పుతిన్ అయితే ఆయన కూడా కొన్ని తప్పిదాలకు పాల్పడినట్లు తెలిపారు. ఇక మీ నేత శకం ముగిసినందున రష్యా అధికారిక సేనలకు విధేయత చూపుతున్నట్లు ప్రమాణ పత్రాలపై సంతకాలు చేయాలని పుతిన్ ఆదేశాలు వెలువరించారు. పుతిన్‌పై మెరుపు స్థాయి తిరుగుబాటుకు దిగి తరువాత చల్లారిపోయిన ప్రిగోజిన్‌ను రష్యా అధ్యక్షులే వ్యూహాత్మకంగా హత్య చేయించారని విమర్శలు వెలువడుతున్నాయి. తన ప్రత్యర్థి ప్రిగోజిన్ మరణం గురించి పెద్దగా స్పందించని పుతిన్ ఇక ఈ కిరాయి సైన్యం దారికి రావల్సి ఉందని సంకేతాలు వెలుడరించారు. వీరి విధేయత ప్రకటనకు పుతిన్ పేరిట అధికారిక డిక్రీ వెలువడినట్లు తెలిసింది.
దీనిపై పుతిన్ సంతకాలు ఉన్నాయి. కాగా ప్రిగోజిన్‌ను పుతిన్ అంతమొందించినట్లు పాశ్చాత్య దేశాలు కొన్ని ఆరోపించడంపై క్రెమ్లిన్ స్పందించింది. ఇది అవాస్తవం అని కొట్టిపారేసింది. కాగా పుతిన్ వెలువరించిన డిక్రీ వెంటనే అమలులోకి వస్తుందని అదికారికంగా తెలిపారు. కిరాయి సైన్యం ఇక ఉండరాదని ఇందులో తెలిపారు. తప్పనిసరిగా ఈ ప్రైవేట్ సైనిక మూకలోని ప్రతి ఒక్కరు విధేయతను చాటుకుని తీరాల్సిందేనని , ఇతర ప్రైవేటు సైనిక కాంట్రాక్టర్లు కూడా లోపాయికారి సంగతులు వీడాలని స్పష్టం చేశారు. ఇటువంటి గ్రూప్‌లు ఎక్కడున్నా వెంటనే వాటిపని పడుతామని పుతిన్ తరఫున హెచ్చరికలు వెలువడ్డాయి. ప్రిగోజిన్ మరణించినట్లు తెలిసింది.
అయితే దీనిపై వివరాలు తెలియవని అధికారికంగా తెలిపారు. దర్యాప్తు తరువాత పూర్తి వివరాల వరకూ ఆగాల్సిందే అని క్రెమ్లిన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఓ ప్రైవేటు విమానం పదిమందితో వెళ్లుతుండగా పతనం చెందిందని , తరువాత అన్వేషించగా మృతులలో ప్రిగోజిన్ కూడా ఉన్నారని ముందుగా రష్యా పౌర విమానయాన సంస్థ తెలిపింది. మృతుల కుటుంబాలకు పుతిన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. రెండు నెలల క్రితమే ప్రిగోజిన్ పుతిన్‌పై తిరగుబాటుకు దిగడం సంచలనం అయింది. తరువాత ఆయన రాజీపడ్డారు.
ప్రవాసానికి వెళ్లారు. కిరాయి సైన్యాలు అధికారిక సైన్యంతో కలిసి పనిచేయాలి, విధేయత చాటుకోవల్సి ఉంటుందని తెలిపే అధికారిక సందేశాన్ని క్రెమ్లిన్ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ప్రత్యేక సైనిక చర్యలకు దిగుతున్నామని ప్రకటించుకునే వారు ఎవరైనా ముందుగా ఈ పద్ధతి వీడాల్సి ఉంటుంది. తమకు విధేయత చాటుకోవల్సి ఉంటుందని పుతిన్ సంతకాలతో పత్రాలు వెలువడ్డాయి. వీటిని వాగ్నర్ సభ్యుల కోసం వారి సంతకాల కోసం సిద్ధం చేసి ఉంచారు.