Monday, December 23, 2024

వరదలపై జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష..

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వివిధ ప్రాజెక్టుల నుండి విడుదల అవుతున్న నీరు భారీగా వచ్చి చేరుతున్న దరిమిలా గోదావరి ఉదృతి ఎప్పుడైనా పెరిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం విశ్రమించరాదని, వరదలను నిత్యం స్వీయ పర్యవేక్షిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా అధికారులకు సూచించారు. శనివారం సారపాక ఐటీసి గెస్ట్ హౌస్ లో వరదలపై మంత్రి పువ్వాడ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడచిన మూడు రోజుల నుండి గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న పరిస్థితులు, చేపట్టిన కార్యక్రమాలు, చేపట్టాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఅర్ వరదలపై ఎప్పటికప్పుడు తనకు స్వయంగా ఫోన్ ద్వారా ఇక్కడ పరిస్థితులకు తెలుసుకుంటున్నారని చెప్పారు. భద్రాచలం వద్ద వరద క్రమేపీ తగ్గటం, పెరగటం జరుగుతుందని, పూర్తి స్థాయిలో వరదలు అధీనంలోకి వచ్చే వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే వరద వచ్చి తగ్గిన ప్రాంతాల్లో, ప్రజల నివాస ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబల కుండా పారిశుధ్య, వైద్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలకు సూచించారు.

వర్షాలు, వరదల వల్ల పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తిలగించి బ్లీచింగ్ చేయాలని, దోమలు వ్యాప్తి నియంత్రణకు మురుగునీటి నిల్వలు లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వ్యాధులు ప్రబల కుండా వైద్య క్యాంపులు నిర్వహించి, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని, తగిన వైద్యాధికారులను, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.

విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా జరగాలని, సురక్షిత మంచి నీరు సరఫరా చేయాలని, అందుకు గాను అవసరం అయిన ప్రతి చోట మంచినీటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల నుండి తరలించిన వారిని అప్పుడే ఇళ్లకు పంపకుండా పూర్తిగా వరదలు తగ్గుముఖం పట్టే వరకు వారికి నచ్చచెప్పి పునరావాస కేంద్రాల్లో ఉండేలా చూడాలన్నారు. వారికి మంచి భోజనం, త్రాగునీరు, విద్యుత్ తదితర వసతుల ఏర్పాట్లు కొనసాగించాలని అన్నారు.నిత్యం పోలీస్ యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో గస్తీ ఎర్పాటు చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని పోలీస్ శాఖను మంత్రి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News