భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలోని సారపాక బిపిఎల్ పాఠశాల, బూర్గంపహడ్ లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. పునరావాస కేంద్రాలలో ఉన్న వరద ముంపు బాధితులను పువ్వాడ కలిసి ధైర్యం కల్పించారు. అనంతరం బూర్గంపహడ్ గ్రామంలో క్రమంగా వరద నీరు చేరడంతో నిర్వాసితులను తక్షణమే ఖాళీ చేయాలని వారిని మంత్రి కోరారు. పునరావాస కేంద్రానికి వెళ్ళాలని, అక్కడ అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. తెలిసి ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని సూచించారు.
మీకు ఎలాంటి ఇబ్బంది లేదని రెండు రోజులు ఓపికగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. మంచి ఆహారం, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అక్కడే ఎర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందులు ఏమైనా కావాలంటే తక్షణమే జిల్లా వైద్యాధికారి సమాచారం ఇచ్చి వెంటనే తెప్పించుకోవాలని వైద్య సిబ్బందితో పాటు ప్రజలకు తెలిపారు. పువ్వాడ వెంట ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, తెల్లం వెంకట్రావు తదితరులు ఉన్నారు .